అంతర్జాలం..జరపైలం

అంతర్జాలం..జరపైలంనేడు అంతర్జాలం(ఇంటర్నెట్‌) లేకుండా క్షణం గడవదు. ఎనిమిది బిలియన్స్‌కు పైగా ప్రపంచ మానవాళిని క్షణాల్లో ఏకం చేయగల సామర్థ్యం అంతర్జాలానికి మాత్రమే సొంతం. ‘నెట్‌ వర్క్స్‌ ఆఫ్‌ నెట్‌వర్క్‌’గా పిలువబడుతున్న ఇంటర్నెట్‌ ద్వారా ప్రపంచ నలుమూలల ఉన్న కంప్యూటర్లను అనుసంధానం చేస్తూ ప్రామాణిక సమాచార వితరణ సాధనంగా క్షణాల్లో ఒకరి నుంచి మరొకరికి సమాచారాన్ని చేర్చుతున్న మహత్తర శక్తివంతమైన మాద్యమంగా మానవాళిపై విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే అంతర్జాల వినియోగం మానవాళి శ్రేయస్సుకు మరింత ఊతమివ్వాలని, ఇంటర్నెట్‌ వాడకంతో మోసాలు, అక్రమాలకు తావివ్వకూడదని విస్తతంగా ప్రచారం చేయ డానికి ప్రతి యేటా 06 ఫిబ్రవరిన ప్రపంచ దేశాలు ‘సురక్షిత అంతర్జాల దినం (సేఫర్‌ ఇంటర్నెట్‌ డే)’ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాదికి గాను ‘మెరుగైన అంతర్జాలం కోసం అందరం కలుద్దాం (టుగెదర్‌ ఫర్‌ ఏ బెట్టర్‌ ఇంటర్నెట్‌)’ అనబడే నినాదంతో ప్రచారం చేస్తున్నారు.
అంతర్జాలం నేడు కనీస అవసరాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలుస్తున్నది. అన్నం, నీరు లేకుండా బతకొచ్చేమోగాని ఇంటర్నెట్‌ కనెక్ట్‌ గానీ, స్మార్ట్‌ఫోన్‌ గానీ లేకుండా క్షణం కూడా గడవడం లేదంటే అతిశయోక్తి కాదు. నేటి సమాజంలో పిల్లల నుంచి మొదులకుని యువత, పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు ఇంటర్నెట్‌లో మునిగి తేలుతున్నారు. దీంతో అంతర్జాలాన్ని దుర్వినియోగమై చాలాచోట్ల ఇంటర్నెట్‌ మోసాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరాల్లో సైబర్‌ బుల్లీయింగ్‌, ఆన్‌లైన్‌ అడిక్షన్‌, తప్పుడు సమాచార వితరణ, వ్యక్తిగత సమాచార చోరీ, సమాచార,నగదు దోపిడీ, సైబర్‌ మోసాలు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల రవాణా, అశ్లీల వెబ్‌సైట్లు, చట్టవిరుద్ధ కార్యాలు, సేవలు, ఏఐ ఆధారిత డీప్ల్‌ ఫేక్‌ వీడియోలు లాంటి పలు అంశాలు వస్తాయి. దీనికి తోడుగా అంతర్జాల దుర్విని యోగంతో మానవ సంబంధాలు కొన్ని సన్నగిల్లడం, ఈర్ష్యాద్వేషాలు పెరగడం, విభేదాల సంక్షోభాలు అంకురించడం, అభద్రతాభావం పెరగడం, ఆందోళన, మూడ్‌ స్వింగ్‌, మానసిక ఒత్తిడి, ఒంటరితనం వెంటాడడం, ఏకాగ్రత తగ్గడం, పనిలో శ్రద్ద కోల్పోవడం లాంటి పలు ప్రతికూలతలు కూడా ఉన్నాయని గమనించాలి.
పూర్తి పరిజ్ఞానం లేకుండా ఇంటర్నెట్‌ వేదికలను వినియోగిస్తే మనకు తెలియకుండానే సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడవలసి వస్తుందని తెలుసుకోవాలి. అంతర్జాలం పట్ల కనీస అవగాహన కలిగి ఉండడం, పరిమితులను తెలుసుకోవడం, సైబర్‌ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఆన్‌లైన్‌ సేఫ్‌ టూల్స్‌ గురించి తెలుసుకోవడం, సైబర్‌ నేరాల పట్ల సమాజాన్ని జాగత పరచడం, వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుచుకోవడం లాంటి పలు జాగ్ర త్తలు ప్రతి ఒక్క ఇంటర్నెట్‌ వినియోగదారుడికి తెలిపే పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని అంతర్జాల నిపుణులు సూచి స్తున్నారు. కనీస ఆన్‌లైన్‌ అవగాహనలతో సురక్షితమైన అంతర్జాల అనంత అద్భుత ప్రయోజనాలను ఆస్వాదిద్దాం, విశ్వ మానవాళితో అనుసంధానంలో ఉందాం.
(06 ఫిబ్రవరి ‘సురక్షిత అంతర్జాల’ దినం)
– బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037