దర్యాప్తు కొనసా..గుతోంది..

Central team investigation– మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ నాణ్యతపై కేంద్రం బృందం విచారణ
– సాగునీటి శాఖ ఇంజినీర్లతో భేటిొ నిర్మాణ లోపాల్లేవు: మురళీధర్‌
– ఇసుక కదలికతోనే సమస్య ఉత్పన్నమైందని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతున్నది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మెన్‌ అనిల్‌జైన్‌తో కూడిన ఆరుగురు సభ్యుల బృందం బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటి అయింది. తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి. మురళీధర్‌, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన అంశంపై కేంద్రబృందం ఇంజినీర్లతో పూర్తిస్థాయిలో చర్చించింది. ఆనకట్టకు చెందిన సాంకేతిక అంశాలపై కూడా సుదీర్ఘంగా మంతనాలు జరిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్ర బృందం సేకరించింది. అదనంగా మరికొంత సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. త్వరలో కేంద్రం బృందం అడిగిన ఇతర వివరాలు పంపిస్తామని తెలంగాణ సాగునీటి శాఖ తెలియజేసింది. భేటి అనంతరం తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ మీడియా మాట్లాడుతూ ”మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవు..ఏడో బ్లాక్‌లో సమస్య మూలంగా సెంటర్‌ పియర్‌ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి ఇసుక నాణ్యత, నిర్మాణ నాణ్యత అనుమతులు వచ్చాయి. కాపర్‌ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్‌ చివరలో సమగ్ర పరిశీలన చేస్తాం’ అని అన్నారు. డిజైన్‌లోగానీ లోపాలు ఏమైనా ఉన్నాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు మురళీధర్‌ సమాధానమిస్తూ డిజైన్‌లో తప్పులుంటే గత మూడు సీజన్లను బ్యారేజీ ఎలా తట్టుకుందనీ ఎదురు ప్రశ్నించారు. పిల్లర్‌ కుంగుబాటుతో కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదన్నారు. యథావిధిగా సాగునీటిని అందించే అవకాశం ఉన్నదని సాగునీటి శాఖ ఉన్నతాధికారులు చెబుతున్న విషయం విదితమే.