
తెలంగాణ యూనివర్సిటీ లో మెస్ బిల్లులో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్ద యూనివర్సిటీ హాస్టల్ సెక్షన్ అధికారుల దిష్టిబొమ్మ దగ్దం చేశారు.ఈసందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బచ్చనబోయిన శివ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో యూనివర్సిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని, మేస్ బిల్ విషయంలో తప్పుడు లెక్కలు చూయిస్తూ పేద విద్యార్థుల దగ్గర ఫీజుల రూపంలో అధికంగా వసూలు చేస్తున్నారని వివరించారు. అలాగే తప్పుడు బిల్స్ వేసి విద్యార్థులపై అధిక భారం వేస్తున్నారని, సుమారుగా ప్రతినెల విద్యార్థులపై 1200 రూపాయలకు పైగా అక్రమంగా లెడ్జర్ పుస్తకాల్లో రాయడం జరిగిందని తెలిపారు. వీటన్నటిపై తక్షణమే సక్రమంగా విచారణ చేసి విద్యార్థులకు ఉన్నతాధికారులైన వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, చీఫ్ వార్డెన్ లు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ బిల్లులు రాసిన ఉద్యోగస్తులను శాశ్వతంగా తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు సాయి కృష్ణ,సురేష్,అమృత్, సాయి, సింహాద్రి, మోహన్, మహార్షి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.