వీఓఏల సమస్యలను పరిష్కరించాలి

– లేకుంటే కేసీఆర్‌కు గుణపాఠం చెప్తాం :ఎస్వీ రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.రాజ్‌కుమార్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం రమ మీడియాతో మాట్లాడారు. 44 రోజుల సమ్మె అనంతరం ఆగస్టు 29న మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు అనేక హామీలిచ్చారన్నారు. వీఓఏల వేతనాల పెంపు, డ్రెస్‌ కోడ్‌ ఇవ్వడం, పెండింగ్‌ వేతనాల చెల్లింపు, మూడు నెలలకోసారి ఉన్న రెన్యూవల్‌ ను ఏడాదికోసారి చేస్తామన్న హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని చెప్పారు. వీఓఏలను కూరలో కరివేపాకులాగా రాష్ట్ర సర్కారు వాడుకుంటున్నదనీ, ఇదే వైఖరి కొనసాగితే రాబోయే రోజుల్లో వారు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో ఆ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.నగేశ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు సుధాకర్‌, కోశాధికారి సుమలత, వెంకటయ్య, అంజికుమార్‌, జ్యోతి, అరుణ, శ్రీను, రమేశ్‌, బీమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.