ప్రయాణం నరకమే..

Traveling is hell..– చినుకు పడితే మట్టి రొడ్డంతా చిత్తడే
– ఆధ్వానంగా లింగన్‌ పల్లి రోడ్డు
అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని, చినుకు పడితే చిత్తడిగా మారి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బాధిత గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమ మండల కేంద్రానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న లింగన్‌ పల్లికీ వెళ్లే రహదారి పూర్తి ధ్వంసమైంది. వర్షం పడితే గోతుల్లో నీరు నిలుస్తుండటంతో గుంతలు గమనించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి రోడ్డులో ప్రయాణించాలంటే నరకం కనబడుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.
నవతెలంగాణ-దోమ
కొద్దిపాటి వర్షం పడితే ఇక ఈ రోడ్డుపై వెళ్లాలంటే ఇంకా పట్టపగలే చుక్కలు చూడవల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింగన్‌పల్లి గ్రామానికి చెందిన ప్రజలకు ఏం అవసరమున్న మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితి. సమాజం తెలియని పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు ఆ రహదారి గుండా వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అడుగు అడుగున గుంతలు ఇరుకైన రోడ్లు రహదారి ఇరువైపులా రోడ్డు పైకి వచ్చిన చెట్ల కొమ్మలు, మట్టి రోడ్డు కావడంతో చిరుజల్లులకు బురదమయంగా మారుతుంది. ఇలాంటి ఎన్నో కష్టాల కదలిలో ఆ పల్లెల ప్రజానీకం ప్రతి నిత్యం దుర్భరమైన జీవనాన్ని కొనసాగించే వలసిన పరిస్థితులు దాపురించాయి. మండల కేంద్రానికి మూడు, ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెలకు రహదారి సౌకర్యవంతంగా లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మాయిలు, మహిళలు ఒంటరిగా వెళ్లాలన్న భయపడే పరిస్థితి ఉంది. ప్రతిరోజు పాఠశాల, కళాశాలకు, నిత్యవసర పనులకు మండల కేంద్రానికి చేరాలంటే కాలినడకన అక్కడకు వెళ్లవలసిన పరిస్థితి ఉన్నది. దీనివల్ల వారు ప్రతిరోజు దారిపై వెళ్తూ మా పల్లెకు దారి వేసే పుణ్యాత్ములు ఎవరు అంటూ వేడుకుంటున్న ఆవేదనకరమైన పరిస్థితి నెలకొంది. దోమ మండల కేంద్రంలోని ఇలాంటి దుస్థితి ఉంటే ఇంకా మారుమూల పల్లెలకు రోడ్డు ఎలా ఉంటుందో ఇట్లాగే అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం వర్షాకాలంలో బురదమైనా మట్టి రోడ్డుపై సర్పంచ్‌ గ్రామస్తులతో కలిసి వరి నాటు వేసి నిరసన వ్యక్తం చేసి, మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన సంబంధిత అధికారులు,ప్రజా పాలకులు మట్టి రోడ్డుపై నేటి వరకు చర్యలు చేపట్టలేదు. కొత్త ప్రభుత్వంలో అయినా రోడ్డు మరమ్మతులు చేపడుతారని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో మాట్లాడి రోడ్డు సమస్యను పరిష్కరించాలని వివిధ గ్రామస్తులు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
రోడ్డుపైన వెళ్లాలంటే చాలా భయమవుతుంది. గర్భిణులు మహిళలు రోడ్లపై వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆ రోడ్డుపై వెళ్లాలంటే ఎప్పుడు ఏం అవుతుందో అని భయాందో ళనతో వెళ్లాల్సి వస్తుంది. సమస్యను పరిష్కరిం చాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి సమస్యను పరిష్క రించాలి.
మొగులయ్య ఎల్లారెడ్డి పల్లి గ్రామం
చినుకు పడితే మట్టి రొడ్డంత చిత్తడే
లింగన్‌పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది. దీంతో నిత్యం రాకపోకలు సాగించే గ్రామస్తులు, వాహనదారులు, విద్యార్థులు, తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా బురదమయంగా మారి నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నాం. మండల అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి తమ గ్రామానికి నూతన బిటీ రోడ్డు వేయాలి.
నర్సింలు ఎల్లారెడ్డి పల్లి గ్రామం
ఇబ్బందులు పడుతున్నాం
ప్రతిరోజు మండల కేంద్రనికి రావడానికి ప్రతి నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొద్దిపాటి వర్షం పడిన బురదతో నిండిన రోడ్లు దర్శనిమిస్తున్నాయి. ఈ రోడ్లపై వెళ్లినప్పుడు కొన్నిసార్లు మట్టి రోడ్డుపై అదుపుతప్పి పడిన సందర్భాలు ఉన్నాయి. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని మట్టి రోడ్డుపై బీటీ రోడ్డు వేయాలి.
బల్ల వెంకటేష్‌ లింగన్‌పల్లి గ్రామం