గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి

– గీట్ల ముకుంద రెడ్డి
నవతెలంగాణ -శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు వంట వార్పు నిర్వహిస్తు సమ్మె నిర్వహించగా సమ్మె శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి, హుజురాబాద్ జోన్ కమిటీ సభ్యులు గుండేటి వాసుదేవ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ, వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసినట్లుగానే గ్రామ పంచాయతీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలిని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీల ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సఫాయి అన్నా సలామ్ అన్నా అని కేసీఆర్ అంటే గ్రామపంచాయతీ సిబ్బంది కడుపులు నిండవని,వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మె నేటికీ 20వ రోజుకు చేరిందని, గ్రామాలు కంపు కొడుతున్నాయని ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం వెంటనే వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. పంచాయతీ కార్మికులు చేసే అన్ని పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పిఆర్సిలో నిర్ణయించిన మినిమన్ బేసికు రూ. 19 వేల వేతనంగా చెల్లించాలని ఆ లోపు జీవో నెం.60 ప్రకారం స్వీపర్లకు 15వేల 600 లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19.500/లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలన్నారు. జీవో నెం.51ని సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరీలన్నింటినీ యధావిధిగా కొనసాగించాలన్నారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో నురణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. పి.ఎఫ్ ఈ.ఎస్.ఐ ప్రమాద బీమా, గ్రాట్యూటీ, గుర్తింపు కార్డులు, ఇవ్వాలన్నారు.  ప్రమాదంలో మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు. వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలన్నారు. డిమాండ్ల పరిష్కరం కోసం జెఎసి ప్రతినిధులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్  వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్లేశం, పలు గ్రామాల గ్రామ పంచాయతీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.