– దాన్ని ముట్టుకుంటే వరంగల్ అగ్నిగుండమే
– కడియం శ్రీహరి వెళ్లిపోయాకే కారులో పెరిగిన జోష్
– సీఎం రేవంత్‌రెడ్డివి ఉద్దెర మాటలే..
– సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
– వరంగల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
నవతెలంగాణ-హసన్‌పర్తి
కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దాన్ని ముట్టుకుంటే వరంగల్ అగ్నిగుండమే అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ఎర్రగట్టు గుట్ట క్రాస్‌రోడ్డులోని కేఎల్‌ఎన్ ఫంక్షన్‌హాలులో సోమవారం నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. వరంగల్‌లో కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, వెయ్యి పడకల ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. వరంగల్ జిల్లాకు టెక్స్‌టైల్ పార్కు, వెటర్నరీ యూనివర్శిటీ ఇచ్చిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ చిహ్నంలోని కాకతీయ తోరణం తీసేస్తానని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వందరోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, ఈ వందరోజుల్లో ఉద్దెర మాటలే తప్ప తెలంగాణ ప్రజలనుద్దరించిందేమీ లేదని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తున్నట్టు అన్ని ఫేక్, లీక్ వార్తలే తప్పా.. వాటి అమలులో ప్రజల్లోకి వెళ్లింది లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుందని, అందుకే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించాలని సూచించారు. కేసీఆర్‌కు అద్భుతమైన ప్రజాస్పందన ఉందని, కడియం లాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కడియం శ్రీహరి పార్టీని వీడిన తరువాత వరంగల్ బీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్నారు. కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ ఇచ్చినా, బీఆర్‌ఎస్ పార్టీకి ఆయన ద్రోహం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని గతంలో లంకె బిందెల దొంగతో పోల్చిన కడియం శ్రీహరి ఇప్పుడు అదే రేవంత్ చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారని విమర్శించారు. ఇంతగా దిగజారడం అవసరమా అని కడియంను ప్రశ్నించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. టీడీపీ నుంచి కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇచ్చింది తానేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్‌టీ.రామారావు కడియంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా.. తాను బతిమిలాడి టికెట్ ఇప్పించానని గుర్తుచేశారు. ఆపై కులం ప్రాతిపదికన తనకు మంత్రి పదవి రాకపోతే.. కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇప్పించానన్నారు. కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీఆర్‌ఎస్ మూడో స్థానంలో ఉంటుందని తాను ముందే చెప్పానన్నారు. కడియం శ్రీహరి పార్టీ మారే పరిస్థితి ఉందని హరీశ్‌రావు తనతో అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, బండ ప్రకాష్‌రావు, తదితరులు పాల్గొన్నారు.