మర్కోడు నుంచి కరకగూడెం రోడ్డు నిర్మాణం చేయాలి

– అటవీ అనుమతుల పేరుతో రోడ్డు ఆపడం వల్ల గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
– పోతినేని సుదర్శన్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
 మండలంలోని మర్కోడు గ్రామం నుంచి కరకగూడెం వరకు రహదారి నిర్మించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మర్కోడులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడుతూ.. అటవీ అనుమతుల పేరుతో రోడ్డు నిర్మాణం ఆపడం వల్ల గిరిజన ప్రజలు రవాణా సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మైనింగ్ కార్యకలాపాల కోసం అభయారణ్యంలో ఉన్న  వందల ఎకరాలు అటవీ భూములను ఇస్తున్నారని అన్నారు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మాత్రం అటవీ అనుమతుల పేరుతో రోడ్డు నిర్మాణం అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఏజెన్సీ జిల్లాల్లో అనేక చోట్ల రోడ్డు నిర్మాణాలు  ఆగిపోయాయని  విమర్శించారు. గతంలో ఖమ్మం నుంచి కరకగూడెం వరకు బస్సు సౌకర్యం ఉండేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనుల ఉమ్మడి హక్కులు కల్పించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన ఆళ్ళపల్లి మండలంలో గిరిజన, గిరిజనేతర ప్రజలు పోడు భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని, ఆ భూములకు కరెంట్ సౌకర్యం, సాగునీటి బోర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనేతరులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఒకేసారి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఎజె రమేష్, రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, మండల నాయకులు బొమ్మల కనకరాజు, ముసలి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.