”తాజా కూరలలో రాజా ఎవరండి.. ఇంకా చెప్పాలా? వంకాయేనండి” అన్నట్టుగా…. కేవలం రుచిలో మాత్రమే కాదు.. ఔషధ గుణాల్లో కూడా వంకాయ రాజే! వంకాయతో అనేక రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. అలాగే అనేక రకాల పోషకాలుంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలని నిపుణులు చెబుతున్నారు. వంకాయతో తయారుచేసే వెరైటీ వంటలను చూద్దాం.
వంకాయ బఠాణి కర్రీ..
కావాల్సిన పదార్ధాలు: వంకాయలు – పావుకిలో, పచ్చి బఠాణీలు – కప్పు, పచ్చిమిర్చి – మూడు, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, దనియాలపొడి – 2 టేబుల్ స్పూన్లు, కారం – టీస్పూను, ఉప్పు – తగినంత, కొత్తిమీర తురుము – టేబుల్ స్పూను, కొబ్బరి తురుము – టేబుల్ స్పూను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు – తాలింపుకు సరిపడేన్ని.
తయారీ విధానం: అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసుకుని పక్కన పెట్టాలి.. పచ్చిమిర్చి కూడా ముద్దలా చేసి పక్కన పెట్టాలి. ఎండు బఠాణీలను రాత్రే నానబెట్టి కుక్కర్‌లో ఉడికించాలి. పాన్‌లో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి వేసి పచ్చిమిర్చి ముద్ద, బఠాణీలు వేసి ఓ నిమిషం వేయించాక కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక.. చివరగా దనియాలపొడి, కారం, ఉప్పు, కొబ్బరితురుము, కొత్తిమీర తురుమువేసి ఉడికించి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే వంకాయ బఠాణీ కర్రీ రెడీ. ఇది చపాతీలోకైనా, రైస్‌లోకైనా ఎంతో బాగుంటుంది.
మలై మసాలా
కావలసిన పదార్థాలు: వంకాయలు – పావుకేజీ, కొత్తిమీర – ఒక కట్ట, నూనె – పావుకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, యాలకులు – నాలుగు, లవంగాలు – నాలుగు, దాల్చినచెక్క – చిన్నముక్క, జీలకర్ర – అర స్పూను, కారం – ఒక స్పూను, వేయించిన జీలకర్రపొడి – ఒక స్పూను, అల్లంవెల్లుల్లి పేస్టు – ఒక స్పూను, దనియాలపొడి: కొద్దిగా, ఉల్లిపాయముక్కలు: కప్పు, జీడిపప్పు: అరకప్పు, పచ్చిమిర్చి: అయిదు, బాదంపప్పు: నాలుగైదు, ఫ్రెష్ క్రీమ్ -అరకప్పు, వెన్న – ఒక స్పూను, ఉప్పు: తగినంత, ఎండుకొబ్బరిపొడి: రెండు చెంచాలు.
తయారీ విధానం: అరగంట ముందు జీడిపప్పు, బాదం గింజల్ని నీళ్లల్లో నానబెట్టుకోవాలి. కాయ విడిపోకుండా వంకాయల్ని నాలుగు ముక్కల్లా కోసి నీళ్లల్లో వేసుకుని ఆ తరువాత రెండు టేబుల్‌స్పూన్ల నూనెలో వేయించుకుని పెట్టుకోవాలి. నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, దనియాలపొడి, ఎండుకొబ్బరిపొడి వేసుకుని మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె, వెన్న వేసి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత చేసిపెట్టుకున్న మసాలా, జీలకర్రపొడి, కారం, తగినంత ఉప్పు, అరకప్పు నీళ్లు పోసి… వంకాయలు వేయాలి. వంకాయలు ఉడికాక, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తరుగు వేసి ఓసారి కలిపి దింపేయాలి.
బిర్యానీ
కావలసిన పదార్థాలు: వంకాయలు – అర కిలో, బాస్మతి రైస్ – రెండు కప్పులు, ధనియాలు – ఒకటిన్నర స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర స్పూను, నిమ్మరసం – రెండు స్పూన్లు, కొత్తిమీర తరుగు – అరకప్పు, దాల్చిన చెక్క – రెండు ముక్కలు,
తయారీ విధానం: బాస్మతీ బియ్యాన్ని ముందుగానే అరగంట పాటు నానబెట్టాలి. గుత్తి వంకాయ కూర కోసం వంకాయల్ని ఎలా కోసుకుంటారో అలా మధ్యలో నిలువుగా నాలుగు ముక్కలుగా చీరుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో వంకాయలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. చిన్న మంట మీద వేయిస్తే అవి బాగా వేగుతాయి. అవి రంగు మారేవరకు వేయించాక వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వంకాయలు వేయించాక మిగిలిన నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి డీప్ ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు రంగు మారేదాకా ఉంచి వాటిని కూడా తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ముందుగా వేయించిన వంకాయలను వేయాలి. అలాగే కప్పు పెరుగు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఉల్లిపాయల తరుగు వేసి కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి. అలా 20 నిమిషాల పాటు వదిలేయాలి. మరోపక్క అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి. అన్నం వండే గిన్నెలో నీళ్లను వేసి ఉప్పు, నూనె, యాలకులు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు వేసి స్టవ్ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి 70 శాతం ఉడకనివ్వాలి. ఆ తర్వాత నీటిని వంపేసి ఆ అన్నాన్ని ఒక ప్లేట్లో పొడిపొడిగా వచ్చేలా పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ వండేందుకు మందపాటి బేస్ ఉన్న గిన్నెను తీసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి ముందుగా మేరినేట్ చేసిన వంకాయల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ వంకాయలపై కాస్త నీటిని చిలకరించాలి. తర్వాత వండుకున్న అన్నాన్ని పొరలు పొరలుగా వేసుకోవాలి. ఆ పొరలపై ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను కూడా చల్లుకుంటూ ఉండాలి. అలాగే కొత్తిమీర, పుదీనా తరుగును చల్లుతూ ఉండాలి. అలా అయ్యాక పైన మూత పెట్టి పావుగంట చిన్న మంటపై ఉడికించాలి. పావుగంట తర్వాత మూత తీస్తే ఘుమఘుమలాడే వంకాయ బిర్యానీ రెడీ. దీని రుచి అదిరిపోతుంది. ఈ బిర్యానీ పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతుంది. దీన్ని రైతాతో తింటూ పక్కన ఒక ఉల్లిపాయ పెట్టుకోండి. స్పైసీగా చేసుకుని మధ్య మధ్యలో ఉల్లిపాయ తినడం వల్ల రుచిగా అనిపిస్తుంది.
కశ్మీరీ బైంగన్ మసాలా
కావలసిన పదార్థాలు: గుండ్రటి వంకాయలు: అరకేజీ, ఉల్లిపాయలు: నాలుగు, టొమాటో: ఒకటి, దాల్చినచెక్క: ఒక చిన్న ముక్క, యాలకులు: మూడు, జీలకర్ర: చెంచా, పసుపు: అరచెంచా, కారం: రెండు పెద్ద చెంచాలు, దనియాలపొడి: రెండు చెంచాలు, సోంపు పొడి: రెండు చెంచాలు, చింతపండు గుజ్జు: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: కట్ట, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: కాయ విడిపోకుండా వంకాయల్ని నాలుగు ముక్కల్లా కోసి, నీళ్లల్లో వేసి తరువాత టేబుల్‌స్పూను నూనె వేసి వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో చెంచా నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుని వాటి వేడి చల్లారాక మిక్సీలో మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేసి దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర వేయించి పసుపు, కారం, దనియాలపొడి వేసి పావుకప్పు నీళ్లు పోయాలి. రెండు నిమిషాలయ్యాక చేసిపెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు వంకాయలు, సోంపుపొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.
వంకాయ స్పెషల్ వేపుడు
కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, నెయ్యి, కొత్తి మీర, కరివేపాకు.
తయారీ విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. ఇవి వేడెక్కగానే జీలకర్ర, ఆవాలు వేసి వేయించండి. ఆ తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేగాక.. కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించండి. ఇవి దగ్గర పడ్డాక.. దనియాల పొడి, జీలకర్ర పొడి ఉప్పు, కారం, పసుపు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. దించే ముందు కొత్తిమిర తరుగు వేసుకోవాలి. అన్నం, చపాతీ, రోటీ, పుల్క.. దీంతో ఎలా తిన్నా బాగుంటుంది.