సుమైరా అబ్దులాలి… ప్రముఖ పర్యావరణవేత్త. పండుగల సమయంలో ఆడియోమీటర్‌తో నగరం చుట్టూ తిరుగుతూ కనిపిస్తారు. శబ్ద కాలుష్యంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాల వల్ల కలిగే తీవ్రమైన పర్యావరణ సమస్యలకు వ్యతిరేకంగా స్వరం పెంచి ప్రసిద్ధి చెందారు. దీని కోసం ఆవాజ్ ఫౌండేషన్ అనే సంస్థను కూడా స్థాపించారు. ప్రపంచంలోనే ధ్వని కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉన్న ముంబయిలో శబ్ద కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఎత్తిచూపుతూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
1961, మే 22న ముంబయిలో పుట్టిన సుమైర చిన్నతనం నుండి సామాజిక అవగాహనతో పెరిగారు. ‘ఇరవై ఏండ్ల కిందట శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నేను మాట్లాడినప్పుడు ప్రజలు నవ్వారు. అయితే మీ ఆలోచనలు ఉన్నతమైనవి అన్నవారు కూడా ఉన్నారు. సహజంగా భారతీయులు శబ్దాన్ని ఇష్టపడతారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం శబ్ద కాలుష్యంపై పోలీసులు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదికలు మహారాష్ట్రలో రెండవ అత్యధిక (వన్యప్రాణుల తర్వాత) పర్యావరణ నేరంగా మారింది’ అని ఆమె చెప్పారు.
అవగాహన కల్పించేందుకు
శబ్ధ కాలుష్యాన్ని తగ్గించేందుకు మొదటి నుండి ఆమె చేసిన ప్రయత్నాలు నిరంతరంగానూ, నిశితంగానూ ఉన్నాయి. సుమైరా తరచుగా పండుగల సమయంలో తన చేతిలో ఆడియోమీటర్‌తో నగరం చుట్టూ తిరుగుతూ ఉంటారు. శబ్దం స్థాయిలు పెరిగినపుడు ముఖ్యంగా వృద్ధులు, రోగులకు తీవ్రమైన బాధ కలిగిస్తుంది. అందుకే ఆమె బహిరంగ ప్రచారాలు, డాక్యుమెంటరీలు, టెలివిజన్ చర్చలు, పత్రికా కథనాలు, చట్టపరమైన జోక్యాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. 2004లో ఇసుక మాఫియాకు వ్యతిరేంగా పని మొదలుపెట్టారు. దాంతో అనేక బెదిరింపులకు గురయ్యారు. అయినా వెనుదిరగలేదు. శబ్ధ కాలుష్యానికి వ్యతిరేకంగా తన ప్రచారానికి సహాయంగా ఆవాజ్ ఫౌండేషన్ అనే పబ్లిక్ ట్రస్ట్‌ను స్థాపించారు. వాలంటీర్లు, న్యాయ నిపుణుల సహాయంతో అవగాహన కార్యక్రమాలు కొనసాగించారు.
విస్తృత ప్రచారం
సైరన్‌లు, హార్న్‌లపై తగిన శబ్ద స్థాయి పరిమితులకు సంబంధించి సుమైరా సిఫార్సులను మహారాష్ట్ర ప్రభుత్వం చట్టంగా నోటిఫై చేసింది. ఆమె ముంబయి మెట్రో నిర్మాణం వల్ల కలిగే శబ్దానికి వ్యతిరేకంగా పోరాడారు. హారన్‌లకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారంలో పనిచేశారు. ఆమె కృషి ఫలితంగా మహారాష్ట్ర అంతటా ప్రభుత్వం పండుగ సీజన్‌లో డీజేలపై నిషేధం విధించింది. అలాగే హారిన, బాణసంచా కాల్చడం, నిర్మాణ కార్యకలాపాలు మొదలైన వాటి వల్ల కలిగే శబ్దాన్ని తగ్గించాలని ఆమె ఆవాజ్ ఫౌండేషన్ ద్వారా అనేక పిటిషన్‌లను దాఖలు చేశారు. 2007లో ముంబై నాయిస్ మ్యాప్‌ను నగర అభివృద్ధి ప్రణాళికలో చేర్చాలని కోరారు. చివరకు 2016లో హైకోర్టు అన్ని రకాల శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలు నిష్పక్షపాతంగా ఉంటుందని, ఇది అన్ని మతాల పండుగలు వేడుకలకు వర్తిస్తుందని ప్రకటించింది.
ప్రైవేట్ హెలిప్యాడ్‌లకు వ్యతిరేకంగా…
ఆమె కృషి ఫలితంగా 2016లో పండుగల సమయంలో శబ్దం స్థాయి గణనీయంగా తగ్గిన ఏకైక నగరం ముంబయి అలాగే ఆమె ముంబయిలో ప్రైవేట్ హెలిప్యాడ్‌లను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2010లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల ఇళ్లపై రూఫ్‌టాప్ హెలిప్యాడ్‌లను అనుమతి ఇచ్చింది. అయితే పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అటువంటి హెలిప్యాడ్‌లను నిలిపివేయాలని ప్రకటించడంతో సుమైరా ప్రయత్నాలు ఫలించాయి. అక్కడే కాక భారతదేశం అంతటా వాటి వినియో గాన్ని నిషేధించింది. అలాగే 2010లో సుమైరా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను కఠినమైన శబ్ద నియమాలు పాటించాలని అభ్యర్ధించారు. శబ్ద కాలుష్యం కోసం జాతీయ డేటాబేస్ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆమె అందిం చిన అన్ని సూచనలను పొందుపరిచిన ఆ శాఖ నాయిస్ రూల్స్ లో అనేక మార్పులు చేసింది. ఇదే భారతదేశంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క నేషనల్ నాయిస్ మానిటరింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి కూడా దారితీసింది.
కాలుష్య నియంత్రణ మండలిలో…
మహారాష్ట్ర ప్రభుత్వం వాహనాలపై ‘హార్న్ ఓకే ప్లీజ్’ అనే పదాన్ని కూడా నిషేధించింది. ఇది డ్రైవర్లను అనవసరంగా హారన్ చేయడాన్ని ప్రోత్సహించి శబ్ద కాలుష్యానికి కారణమవుతుందని పేర్కొంది. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు సుమైరా మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కమిటీతో కలిసి పనిచేశారు.
దీనిపై ఆమె సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా నోటిఫై చేసింది. సుమైరా అక్రమ ఇసుక తవ్వకాలను గుర్తించి వాటి ఫొటోలు, వీడియోల ద్వారా సాక్ష్యాలను స్వయంగా నమోదు చేశారు. దాంతో ఇసుక మాఫియా ఆమెను పదే పదే బెదిరించింది, దాడులకు కూడా దిగింది. ఒకసారి ఆమె కారును ట్రక్కుతో ఢకొీట్టిన సంఘటన కూడా ఉంది. భయపడకుండా ఆమె ఇతర కార్యకర్తలు, ఎన్‌జీఓలను కలుపుకొని వారి బెదిరింపులకు వ్యతిరేకంగా మిత్రా అనే ఉద్యమాన్ని స్థాపించారు
డాక్యుమెంటరీలు…
2012లో ‘లైన్ ఇన్ ది శాండ్’ అనే డాక్యుమెంటరీలో ఆమె భాగమయ్యారు. ఈ డాక్యుమెంటరీ ఇసుక తవ్వకాలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశంపై దృష్టి సారించింది. చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో సుమైరా జుహు బీచ్‌లో ‘ఇసుక మైనింగ్ సమస్యను పాతిపెట్టవద్దు’ అనే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. సుమైరా 2004లో ‘దేవుడు చెవిటివాడా?’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా తీశారు. పర్యావరణ సమస్యలకు వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రయత్నాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఆమె చేసిన ఈ కృషికి మదర్ థెరిసా అవార్డు, అశోక పురస్కారాలు వంటి అవార్డులు పొందారు.
ఆమెపై భౌతిక దాడులు
అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 2003లో అలీబాగ్‌లోని తన పూర్వీకుల ఇంటి దగ్గర అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారనే కేసు ఆమె దృష్టికి వచ్చింది. వీరితో ఘర్షణ పడటంతో మైనర్లు ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఎఫ్‌ఐఆర్‌ను అనుసరించి ఆమెపై దాడి చేసిన నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు పెట్టారు. 2006లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆవాజ్ ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా అప్పీల్ చేసింది. అనేక విచారణలు తర్వాత హైకోర్టు అన్ని తీర ప్రాంతాలలో అక్రమ ఇసుక తవ్వకాన్ని నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. చివరికి మహారాష్ట్ర అంతటా ఇసుక వెలికితీతను నిషేధించింది.
– సలీమ