చౌదర్‌పల్లిలో భూమి కబ్జాకు గురి కాలేదు

The land in Chowderpally was not encroached upon– వారి పట్టా భూమిలోనే రోడ్డు నిర్మాణం
– ఎఫ్టిఎల్‌ ల్యాండ్‌ కబ్జాకు గురైందన్న మాట అవాస్తవం
– తేల్చిన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని చౌదర్పల్లిలో ఎటువంటి ప్రభుత్వ భూమి కబ్జా కాలేదని ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. వార్తా కథనాల్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న విషయంపై మంగళవారం చౌదర్పల్లిలో ఇరిగేషన్‌ ఏఈ సునీత, రెవెన్యూ ఆర్‌ఐ వెన్నెల పర్యటించి సర్వే చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీఎల్‌లో భూమి కబ్జా కాలేదన్నారు. శ్రీ పోచమ్మ గుడి సమీపంలో ఉన్న పట్టాదారులు నిబంధనల ప్రకారమే రోడ్డు నిర్మాణం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. చెరువుకు సంబంధించిన భూమిలో ఎటువంటి కబ్జా కాలేదని, నిర్మాణం కూడా జరగలేదని ఇరిగేషన్‌ ఏఈ అన్నారు. శ్రీ పోచమ్మ చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చదును చేసుకున్నామని గుడి నిర్వాహకులు తమతో చెప్పారని తెలిపారు. ప్రభుత్వ భూమి ఎక్కడ కబ్జా కాలేదని, వీటిపై వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తమని అధికారులు స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి, చెరువు శిఖం సంబంధించి ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే తమ దృష్టి తీసుకురావాలని వారు స్థానికులను కోరారు.