పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటా

– వీణవంకలో 30 కోట్ల తో అభివృద్ధి పనులకు శ్రీకారం
– ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
సొంత గ్రామమైన వీణవంకలో పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని, మండల కేంద్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న నాలుగు లైన్ల రోడ్డుకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ముగ్గు పోసి మాట్లాడారు. మండల కేంద్రంలో 25 కోట్ల రూపాయలతో 75 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం, గ్రామంలో సుమారుగా మరో ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని అన్ని వీధుల్లో సిసి రోడ్డు నిర్మాణం డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రోడ్డు విస్తరణ పనులతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కావున గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. అంతకుముందు మండలంలోని రెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి, కొండపాక, మామిడాలపల్లి గంగారం తో పాటు తదితర గ్రామాల్లో మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎంపీపీ ముసుపట్ల రేణుక తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచులు నీల కుమారస్వామి, పోతుల నరసయ్య, పంజల అనుష సతీష్, నాయకులు, అడిగొప్పుల సత్యనారాయణ, గంగాడి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.