భూపోరాట పేదలపై ఖాకీ జులుం

కోరుట్లలో అర్ధరాత్రి సీపీఐ(ఎం)నాయకుల అరెస్ట్‌.. గుడిసెల తొలగింపు
– ఆందోళనకు దిగిన మహిళలను అడ్డుకున్న పోలీసులు
– రాష్ట్ర నాయకుడు బాలకృష్ణను ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలింపు
– నాయకులు, పలువురు మహిళలకు గాయాలు
– ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకూ పోరాటం ఆపబోమని పిలుపు
– సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఖండన
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / మల్లాపూర్‌
ఇండ్ల స్థలాల కోసం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్ణణంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాడుతున్న పేదలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత గుడిసెల్లో ఉన్న నాయకులను, యువకులను బలవంతంగా అరెస్టు చేశారు. ఆపై రెవెన్యూ అధికారులతో కలిసి గుడిసెలన్నింటినీ కూల్చేశారు. పేదలంతా కష్టపడి తవ్వుకున్న బావిని సైతం పూడ్చారు. దాంతో ఉదయం 8గంటలకే మహిళలంతా ఆర్డీఓ ఆఫీస్‌కు చేరుకున్నారు. అప్పటికే మోహరించిన పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. ర్యాలీ చేపట్టేందుకు వచ్చిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు బాలకృష్ణను ఈడ్చుకెళ్లి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో మహిళలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దొరికినోళ్లను దొరికినట్టుగా మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాగిపడేశారు. సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత ఏర్పడింది.
గుడిసెలు కూల్చి.. నాయకులను అరెస్టు చేసి
49 రోజులుగా సాగుతున్న భూపోరాటాన్ని పలు విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇక దాడులకే దిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో కరెంటు నిలిపివేసి చిమ్మచీకట్లో దాడులకు తెగబడింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసికట్టుగా వచ్చి జేసీబీలతో గుడిసెలను ధ్వంసం చేశారు. పేదలు తవ్వుకున్న బావిని సైతం కూల్చివేశారు. అక్కడే నిద్రిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్‌ తిరుపతినాయక్‌ సహా యువకులను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న పేదలంతా సోమవారం ఉదయ 8గంటలకే పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపేందుకు సిద్ధమైన వారందరినీ అప్పటికే ఆర్డీఓ ఆఫీసు పరిసరాల్లోని గల్లిగల్లీలో మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు లెల్లెల బాలకృష్ణను చుట్టుముట్టి ఈడ్చుకెళ్లి స్టేషన్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన మహిళలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ‘నిలువనీడ లేని మాకు కనీసం 60గజాల స్థలం ఇవ్వరా?’ అంటూ నిలదీశారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని చెబుతున్నారే తప్ప ఎక్కడా ఒక్క ఇల్లు ఇచ్చిందని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విలువైన భూములను పెద్దలు కబ్జా చేసినా పట్టించుకోని సర్కారు నిలువ నీడ కోసం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న తమపై దాడులు చేయటం న్యాయమేనా? అంటూ ఆగ్రహించారు. అప్పటికే పెద్దఎత్తున చేరుకున్న పోలీసులు మహిళలను చెదరగొట్టారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు బాలకృష్ణ, జిల్లా కన్వీనర్‌ తిరుపతినాయక్‌, పట్టణ కన్వీనర్‌ పోచయ్య, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్‌ గుమ్మడి రమేష్‌ సహా 36 మంది పేదలను అరెస్టు చేశారు.
నిర్విరామ పోరాటం
కోరుట్ల పట్టణంలో సుమారు వెయ్యి మందికిపైగా పేదలు సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు లెల్లెల బాలకృష్ణ, జిల్లా కన్వీనర్‌ తిరుపతినాయక్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని భూపోరాటం చేస్తున్నారు. ఏప్రిల్‌ 10వ తేదీన ప్రారంభమైన ఈ భూపోరాటం 49 రోజులుగా సాగుతోంది. పోరాటం ప్రారంభమైన పది రోజులకే అధికారపార్టీ కౌన్సిలర్‌, అతని అనుచరులు సీపీఐ(ఎం) నాయకునిపై దాడి చేశారు. చంపుతామనీ బెదిరించారు. వెన్నుచూపని దీరుల్లా ఎర్రజెండా నాయకులు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేస్తూ పేదలతో కలిసి మరింత ఉధృతం చేశారు. గుడిసెలు వేసుకున్న భూమిలో పేదలంతా కలిసి ఓ బావిని సైతం తవ్వుకున్నారు. అక్కడే నివసిస్తున్నారు.
కలెక్టర్‌, ఆర్డీఓతోపాటు అధికారులందరికీ వినతులు ఇస్తూ వస్తున్నారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా పిల్లాపాపలతో మహిళలు పెద్దఎత్తున గుడిసెలు వేసున్న స్థలంలోనే నివసిస్తున్నారు. ఆ స్థలానికి పూలే, అంబేద్కర్‌నగర్‌ పేర్లు పెట్టుకుని 49 రోజులుగా అక్కడే ఉంటూ పనులకు వెళ్తున్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఖండన
కోరుట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చేసి మహిళలు, నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అక్కడి పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.