అపర్ణ కంపెనీ ఆక్రమించిన భూములు తిరిగి గిరిజనులకే ఇవ్వాలి

– టీజీఎస్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అపర్ణా కంపెనీ ఆక్రమించిన భూములను తిరిగి గిరిజనులకే ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాం నాయక్‌, ఎల్‌ హెచ్‌ పి ఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు మూడవత్‌ రాంబాల్‌ నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆదేశాల మేరకు మోకిల మండలం,కొండకల్‌ తండాతో పాటు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోని వెలిమల తండా బాధిత లంబాడి గిరిజనుల భూసమస్యపై శనివారం విచారణ జరిగిందని తెలిపారు. ఈ విచారణకు బాధిత గిరిజన కుటుంబాలు, న్యాయవాదులు నలమాస కృష్ణ, కొండూరి వీరయ్య, ఆర్‌ శ్రీరాం నాయక్‌, మూడవత్‌ రాంబాల్‌ నాయక్‌, ఇస్లావత్‌ చందర్‌ నాయక్‌, సీపీఐ(ఎం) చేవెళ్ల డివిజన్‌ నాయకులు దేవేందర్‌, గ్రామ పెద్దలు శంకర్‌ నాయక్‌, రాథోడ్‌ రవి, లక్ష్మణ్‌ నాయక్‌, సురేష్‌, గ్రామ మాజీ ప్రస్తుత సర్పంచులు, నాయకులు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970 నుండి గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. సీలింగ్‌ చట్టం కింద గ్రామ భూస్వాముల నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 1975లో గిరిజనులకు రక్షిత కౌదారుల చట్టం కింద ఇచ్చిన పట్టా భూములను అపర్ణ హౌసింగ్‌ ప్రయిట్‌ లిమిటెడ్‌ కంపెనీ దౌర్జన్యంగా 600 ఎకరాలను అక్రమించిందని పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన భూములను తిరిగి గిరిజనులకు అప్పగించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.లేకపోతే మరో లగచర్ల లాగా గిరిజన సంఘాల అందరిని కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజనులపై మరోసారి దాడులు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.