బీజింగ్‌ ‘నిషిద్ధ నగరం’లో షూటింగ్‌ జరుపుకున్న మొదటి విదేశీ సినిమా ”ది లాస్ట్‌ ఎంపరర్‌”

The first foreign film to be shot in the 'Forbidden City' of Beijing "The Last Emperor"చైనా ఆఖరి చక్రవర్తి పూయి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ”ది లాస్ట్‌ ఎంపరర్‌”. భారీ లొకేషన్లు, వేల సంఖ్యలో ఎక్స్ట్రాలతో తీసిన ఈ సినిమా కథకు 1964లో పూయి రాసుకున్న ఆత్మకథ ”ఫ్రం ఎంపరర్‌ టూ సిటిజెన్‌” ఆధారం. అయితే చరిత్రకారులు ఈ సినిమా అప్పటి చైనా రాజకీయ చరిత్రను సమగ్రంగా చూపించలేదని, ఇందులో కొన్ని అవాస్తవాలు ఉన్నాయని అంటారు. ఈ సినిమాలో పూయిని సాత్వికుడిగా చూపించే ప్రయత్నం జరిగిందని, నిజానికి అతను చాలా దురహంకారి అని, తనకు సేవ చేస్తున్న వారితో కఠినంగా, క్రూరంగా కూడా ప్రవర్తించేవాడని కొందరంటారు. పూయి ఆత్మకథ చదివిన వారికి కొన్ని చోట్ల దర్శకుడు కథకు మార్పులు చేసుకున్నారని కూడా అనిపిస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చైనా రాజకీయ పరిణామాలను దర్శకుడు విశ్లేషించకుండా అవి ఓ క్రమంలో చెప్పుకుంటూ వెళుతూ కేవలం పూయీ జీవితం ఈ పరిణామాలకు ఎలా పరివర్తన చెందింది అన్నదే ప్రధాన కథా వస్తువుగా తీసుకున్నారు. ఇది గమనించవలసిన విషయం.
నిజానికి పూయి జీవితకాలంలో చైనా రాజకీయంగా ఎన్నో మార్పులు చూసింది. రాచరిక వ్యవ్యస్థ అంతరించి తరువాత వచ్చిన బీజింగ్‌ తిరుగుబాటు రోజులు, పీపుల్స్‌ రిపబ్లిక్‌ నుండి సాంస్కతిక తిరుగుబాటు దాకా ఆ కాలంలో చైనా రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. చైనా రాచరికపాలన నిర్మూలన, చైనాపై జపాన్‌, రష్యా సైన్యాల దాడి, తరువాత కమ్యునిస్ట్‌ పార్టీ పాలన ఇవన్నీ పూయి జీవితకాలంలో జరిగినవే. కానీ సినిమాలో ఈ పరిణామాలన్నిటి మధ్య పూయీ జీవితం మాత్రమే కథావస్తువు అవుతుంది. అంటే చైనా అత్యంత రాజకీయ సంక్షీభం అనుభవిస్తున్న సమయంలో నడిచే ఈ కథలో కేవలం ఆఖరి రాజు పూయి జీవితాన్ని మాత్రమే కేంద్రంగా కథ నడిపించారు దర్శకులు బర్నార్డో బర్టోలుసి.
ఈ సినిమా కోసం బీజింజ్‌లోని నిషిద్ధ నగరం (ఫార్బిడన్‌ సిటీ) లో షూటింగ్‌కు చైనా ప్రభుత్వం బర్నార్డోకు అనుమతిచ్చింది. అప్పటిదాకా మరే పాశ్చాత్య దర్శకుడికి దొరకని అవకాశం ఇది. అంటే ”ది లాస్ట్‌ ఎంపరర్‌” ఫార్భిడన్‌ సిటీలో షూటింగ్‌ జరుపుకున్న మొదటి పాశ్చాత్య సినిమా కూడా. ఈ నగరం, 250 ఎకరాల్లో, 9,999 గదులతో చక్రవర్తి తన పరివారంతో జీవించిన ప్రదేశం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు దర్శకులు. ఆనాటి రాచరికపు జీవితాన్ని చిత్రీకరించడానికి కొన్ని షాట్లలో 19,000 ఎక్స్టాలను ఉపయోగించారంటే ఈ సినిమా తెరపై ఎలా వచ్చి ఉంటుందో ఊహించవచ్చు. ముఖ్యంగా పసి పిల్లవాడు పూయి చక్రవర్తిగా సింహాస నాన్ని అధిష్టించిన తరువాత భయంతో బైటకు పరుగెత్తుకుంటూ వెళ్లినప్పుడు వేల మంది హిజ్రాలు తల వంచి వందనం చేసే సీన్‌, తెరపై చూసి తీరవలసిందే.
సినిమా కథ 1950 ప్రాంతం లో మొదలవుతుంది. అప్పటికి 44 ఏండ్ల పూయిని రష్యన్‌ ఎర్ర సైన్యం బంధించి ఐదేండ్లు దాటుతుంది. చైనాలో పీపుల్స్‌ రిపబ్లిక్‌ పరిపాలనకు వచ్చిన తరువాత పూయిని చైనా సైన్యానికి అప్పగిస్తారు రష్యన్లు. రాజకీయ ఖైదీగా, యుద్ధ నేరస్తుడిగా పూయిని ఫుషున్‌ జైలుకి తరలిస్తుంది ప్రభుత్వం. ఇతనితో పాటు ఇద్దరు అంతరంగిక సేవకులు కూడా ఉంటారు. అప్పటికే జైలు జీవితానికి విసిగి పోయిన పూయి తన రెండు చేతులు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. కాని జైలు సిబ్బంది అతన్ని కాపాడతారు. అతను విచారణను ఎదుర్కో వాలని అది తప్పదని చెప్తాడు జైలు అధికారి.
ఇక్కడి నుండి కథ పూయి గతంలోకి వెళ్తుంది. 1908లో రెండేండ్ల పూయిని రాజమాత ఎంప్రెస్‌ డోవగెర్‌ సిక్సీ నిషిద్ధ నగరానికి పిలిపించు కుంటుంది. డోవగెర్‌ సిక్సీ యేహే నారా వంశానికి చెందిన మంచు కులీనురాలు. పూయి ఈమెకు మేనల్లుడు వరస అవుతాడు. మంచూరియాకి రాజు లేకుండా పోతాడని భయపడిన ఆమె ముసలి రాజు మరణించిన కొన్ని గంటలలోనే పూయి ని నగరానికి పిలిపించుకుని అతన్ని తన వారసునిగా ప్రకటిస్తుంది. అయితే అప్పుడు పూయి వయసు కేవలం రెండేండ్లు. వారసత్వం ప్రకటించిన వెంటనే ఆమె కూడా మరణిస్తుంది. అక్కడి ఆచారం ప్రకారం తల్లి రాజమాత కాదు కాబట్టి, చక్రవర్తి అయ్యాక పూయి తల్లి నుండి వేరు చేయబడతాడు. అతన్ని ఆ నిషిద్ధ నగరానికి పంపిస్తూ పూయీ తల్లి అర్మో అనే దాయిని బిడ్డకు తోడుగా పంపుతుంది. పూయి ఈమె పాలు తాగుతున్నాడు. రాజమాత మరణం తరువాత ఆ రెండేండ్ల పిల్లవాడు భయంతో అక్కడ ఉన్న తన తండ్రిని చేరబోతుంటే అతను తలవంచి నమస్కారం చేయడంతో పూయీ జీవితంలో మార్పు మొదలవుతుంది. చక్రవర్తిగా అతనికి ఘనంగా రాజ్యాభిషేకం జరుతుంది. రెండేండ్ల పిల్లవాడు ఆ తంతుతో విసిగిపోయి బైటికి పరిగెడతాడు. ఆ బుడతడు నడిచినంత మేరా సేవకులు నేలకు తలను తాకిస్తూ నమస్కారాలు చేస్తుండగా, ఆ దశ్యం ఆనందం కలిగించకపోగా ప్రేక్షకుల్లో విషాదాన్ని నింపుతుంది.
పూయి చుట్టూ సేవకులుగా ఎందరో హిజ్రాలు ఉంటారు. వాళ్ళ మధ్యనే పూయి బాల్యం గడుస్తుంది. కేవలం అతనికి పాలిచ్చే అర్మో ఒక్కత్తే అతనికి దగ్గరగా ఉండే స్త్రీ. అతను ఏం తినాలో ఏం ఆడుకోవాలో ఏం బట్టలు వేసుకోవాలో అతని నిర్ణయం కాదు. ఆ నగరం దాటి ఆ పిల్లవాడు బైటి ప్రపంచంలోకి వెళ్ళడానికి ఉండదు. పసుపు రాచరికానికి గుర్తు కాబ్టట్టి ఆ రంగు వస్త్రాల్లోనే ఈ బాల చక్రవర్తి ఉంటాడు. అతని ముందు ఎవరూ ఆ రంగు బట్టలు వేసుకోరు.
పూయి దాయిగా వచ్చిన ఆర్మో ఓ పేద యువతి. ఆమెకు బిడ్డ పుట్టాక బలవంతంగా ఆమెను పాలుతాగే ఆ బిడ్డతో పాటు పూయి తల్లి దండ్రుల మందిరానికి తీసుకు వస్తారు సైనికులు. ఆమెలాగే అక్కడికి కొందరు తల్లు లనూ లాక్కువస్తారు. వీరందరి రొమ్ము పాలను పరీక్షించి ఆర్మో పాలు శ్రేష్టమైనవని రాజ వైద్యులు నిర్ణయించడంతో ఆమె బిడ్డను బలవంతంగా ఇంటికి పంపించేసి ఆమెను మాత్రం ఆ ఇంట ఉంచేస్తారు రాజ కుటుంబీకులు. అలా ఆమె పూయికి పాలిచ్చే దాయిగా అక్కడ చేరుతుంది. అయినా ఆమె పూయిని సొంత బిడ్డలా ప్రేమిస్తుంది. ఆమె దగ్గరే పూయీ కూడా ప్రేమను పొందుతాడు. కానీ ఆమెకు పూయిపై ఏ రకమైన అధికారం ఉండదు. పూయికి ఎప్పుడు తన అవసరం కలుగుతుందో అని ఆమె ఇరవై నాలుగు గంటలు అతన్ని కనిపెట్టుకుని ఉంటూ ఉంటుంది.
పూయీ రాజైన ఏడేండ్ల తరువాత అతని తల్లి తన మరో కొడుకు పూ చే ని తీసుకుని అతన్ని చూడడానికి వస్తుంది. తల్లిని దగ్గరకు వెళ్లి హత్తుకునే స్వాతంత్రం కూడా పూయికి ఉండదు. అది రాజమర్యాద కాదు. అతనిలో కోపం పెరుగుతూ ఉంటుంది. తన తమ్ముడు కుటుంబంతో ఉంటే తాను ఇలా ఒంటరిగా ఉండిపోవడం అతనిలో ఇతరులపై కసిని పెంచుతుంది. ఆ సమయంలోనే తమ్ముడు అన్నతో అతను ఇంక రాజు కాడని చైనా రిపబ్లిక్‌ అయిందని రాచరికం అంతరించిందని చెబుతాడు. నిషిద్ధ నగరంలో మంత్రులు మాత్రం ఆ నగరంలో చక్రవర్తిదే అధికారం అని పూయి ఎప్పటికీ తమ రాజని నమ్మకంగా చెప్తారు. అదే రోజు ఆర్మోను బలవంతంగా నగరం నుండి పంపించేస్తారు కుటుంబీకులు. ఇక తొమ్మిదేండ్ల రాజుకు దాయి అవసరం లేదని నిర్ణయం జరిగిపోతుంది. పూయిని ఆఖరిసారి కలిసే అవకాశం కూడా ఆమెకు ఇవ్వరు. ఆర్మో పల్లకి వెనకాల నిస్సహాయంగా పరిగెడతాడు. పల్లకి దాటగానే ఆ నగర ద్వారాలు మూసుకుంటాయి. చక్రవర్తికి కూడా వాటిని తెరిపించే అధికారం ఉండదు.
1919లో పూయికి చదువు చెప్పించడానికి జాన్స్టన్‌ అనే స్కాటిష్‌ ట్యూటర్‌ని తీసుకొస్తారు. ఆ నిషిద్ధ నగరంలో ఆ పిల్లవాడి ఒంటరి తనాన్ని, అతనిలోని కోపాన్ని జాన్స్టన్‌ ముందుగా గుర్తిస్తాడు. అతనికి చదువుతో పాటు ఇంగ్లీషు సంస్కతి, ఆట పాటల్లో శిక్షణ ఇస్తాడు. పూయి జాన్స్టన్‌కు దగ్గరవుతాడు. ముఖ్యంగా అతను బహుమతిగా తెచ్చిన సైకిల్‌ అతనికి ఇంగ్లీషు సంస్కతి పట్ల ఆకర్షణను కలిగిస్తుంది. పూయిలో క్రమంగా తన పరిసరాల పట్ల అయిష్టం పెరిగిపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు అతని సేవకులకు కొరడా దెబ్బలు పడుతూ ఉంటాయి. ఎవరికీ తెలియకుండా పూయి చిన్న ఎలుకలను, పక్షులను తన స్నేహితులుగా చేసుకుని వాటితో సమయం గడుపుతూ ఉంటాడు. తన ఆనందాన్ని కోపాన్ని వాటిపై ప్రదర్శిస్తూ ఉంటాడు. పూయి తల్లి చనిపోతే, చివరి చూపుకి కూడా అతన్ని వెళ్ళనివ్వరు అక్కడి పరివారం. పూయికి తన జీవితం పట్ల రోత పుడుతుంది. పూయికి దష్టిలోపం ఉందని, అతను సరిగ్గా చూడలేకపోతున్నాడని జాన్స్టన్‌ అర్థం చేసుకుంటాడు. డాక్టర్‌కి చూపిస్తే కళ్లజోడు వాడాలని లేదంటే పూయి పూర్తిగా గుడ్డివాడవుతాడని చెప్తాడు. కాని రాజకుటుంబీకులు దీనికి ఒప్పుకోరు. అక్కడి వారిని ఎదిరించి, నచ్చజెప్పి పూయికి జోడు తెచ్చి ఇస్తాడు జాన్స్టన్‌.
ఆ రోజుల్లోనే అతనికి పెండ్లి చేయాలని రాచకుటుంబం అనుకుంటుంది. పెండ్లితో అతని జీవితంలో మార్పు వస్తుందని జాన్స్టన్‌ కూడా చెప్పడంతో పూయి వివాహానికి ఒప్పుకుంటాడు. వాన్రోంగ్‌తో వైభవంగా వివాహం జరుగుతుంది. ఆచారం ప్రకారం ఆమెతో పాటు మరో ప్రధాన ఉంపుడుగత్తె వెన్గ్జ్యు అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది.
మెల్లిగా ఆ నగరంలో మార్పులు తీసుకురావాలని నిశ్చయించుకుం టాడు పూయి. ముందుగా తన జడ కత్తిరించుకుంటాడు. తన వయసు ఆధారం చేసుకుని తన చుట్టూ ఉన్న హిజ్రాలు ఎంతో డబ్బు దోచుకుంటున్నారని కనుక్కుంటాడు. అవి బైటపెట్టమని అతను బలవంత పెట్టడంతో వాళ్లంతా భాండాగారాలని కాల్చేస్తారు. దీనితో మొత్తం పన్నెండు వందల మంది హిజ్రాలను అతను నగరం నుండి బహిష్కరించాలని నిశ్చయించుకుంటాడు.
1924లో బీజింగ్‌ తిరుగుబాటు జరుగుతుంది. ఫెంగ్‌ యుక్సి యాంగ్‌, జిలీ యుద్ధనాయక వర్గానికి నాయకుడు. ఇతడు అప్పుడున్న చైనా అధ్యక్షుడు కావో కున్‌పై తిరుగుబాటు చేస్తాడు. ఫెంగ్‌, హువాంగ్‌ ఫూను బీజింగ్‌ ప్రభుత్వ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తాడు. హువాంగ్‌, ఫెంగ్‌ తరపున అనేక సంస్కరణలను ప్రారంభిస్తాడు. ఇందులో నిషిద్ధ నగరం నుండి చక్రవర్తి పుయీని బహిష్కరించడం ఒకటి. అలా పూయీ తన పరివారంతో ఆ నగరం వదిలేయవల్సి వస్తుంది. చైనాలో అప్పటికే అందరూ తమకో చక్రవర్తి ఉన్న సంగతి మర్చిపోయారు. జపాన్‌ రాజు పూయి వయసువాడు. అందుకని అతని సహాయం తనకు దొరకవచ్చని పూయీ ఆశించి జపాన్‌ వారి స్నేహాన్ని కోరి టిన్స్టిన్‌ వెళతాడు. అయితే తనకు సహాయం చేస్తామని నమ్మకాన్ని కలిగిస్తూనే తనను జపాన్‌ మోసం చేస్తుందని అతను తెలుసుకోలేక పోతాడు. మంచూరియా జపాన్‌ అధినంలోకి వెళ్లిపోయిందని వాళ్లు చెబితే దాన్ని పూయి నమ్ముతాడు.
ఆ నగరంలో జపాన్‌ వారి మధ్య ఉంటూ పూర్తి ఇంగ్లీషువాడిగా మారిపోతాడు పూయి. దొరికిన కొత్త స్వాతంత్య్రంతో అన్ని మరచి విశంఖులంగా జీవిస్తూ ఉంటాడు. అతని రెండవ భార్య అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అక్కడే ఉంటే తన స్థానం వేశ్యకంటే హీనమవుతుందని ఆమె గ్రహిస్తుంది. ఎందుకంటే ఆమె ఉంపుడుగత్తెగా పూయి కుటుంబంలో అడుగుపెట్టింది. భార్య స్థానం ఆమెకు ఎప్పటికీ రాదు. అలాగే చక్రవర్తి అంతరంగిక చెలికెత్త హౌదా కూడా ఆమెకు ఈ కొత్త ప్రపంచంలో రాదు. అందుకని ఆమె పూయితో ఉండలేనని వెళ్లి పోతుంది. దీనితో పూయి భార్య వాన్రోంగ్‌ ఒంటరిదయి పోతుంది. అక్కడ ఒక జపనీస్‌ స్త్రీతో ఆమె స్నేహం చేస్తుంది. ఈమె జపాన్‌ సైన్యంలో గుఢాచారి. ఓ పక్క పూయి కుటుంబ రహస్యాలను జపాన్‌ అధికారులకు అందిస్తూ, మరో పక్క వాన్రొంగ్‌తో స్నేహం చేస్తూ ఆమెను మత్తు మందులకు అలవాటు చేస్తుంది. వాన్రొంగ్‌ క్రమంగా ఆ వ్యసనానికి బానిసవుతుంది. దానితో పాటు పూయి డ్రైవర్‌తో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుం టుంది. అతని బిడ్డకు తల్లి అవుతుంది కూడా. జపాన్‌ సైనికులు ఆమె ప్రియుడిని, పుట్టిన బిడ్డను కూడా చంపేస్తారు. దానితో వాన్రోంగ్‌ మతి చలిస్తుంది.
పూయిని జపనీయులు మంచూకో నగరానికి చక్రవర్తిని చేస్తారు. కానీ ఏ నిర్ణయాధికారం అతనికి ఉండదు. చైనా ప్రభుత్వం రాచరికాన్ని రద్దు చేయడంతో ఆ ప్రభుత్వంపై అతనికి నమ్మకం పోతుంది. జపనీయుల సాయంతో తన రాజ్యాన్ని తిరిగి పొందగలననుకుని వారితో చేతులు కలిపితే వాళ్ళు అతన్ని పావుగా వాడుకుంటుంటారు. ఇక్కడ మరో రకమైన ఖైదు అనుభవిస్తుం టాడు చక్రవర్తి పాత్రధారి పూయీ. ఇక అమెరికా సహాయం తీసుకోవాలని అతను అనుకుంటూ ఉండగానే చైనాలో ఎర్ర సైన్యం అతన్ని బంధిస్తుంది. అక్కడ ఐదేండ్లు గడిపాక మళ్లీ వచ్చిన పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా అతన్ని యుద్ధ ఖైదీగా నిర్ణయించి పునః విద్య కార్యక్రమంలో భాగం చేస్తుంది.
1931లో జాన్స్టన్‌ శాశ్వతంగా ఇంగ్లండ్‌ వెళ్లిపోతాడు. అక్కడ నిషిద్ధ నగరంలో తాను గడిపిన రోజుల గురించి ఓ పుస్తకం రాస్తాడు. దీన్ని పూయికి అంకితం ఇస్తాడు. ఆ పుస్తకం ద్వారా జపనీయుల సహాయం ఇష్టపూర్వకంగా పూయీ తీసుకున్నాడని ప్రస్తుత చైనా ప్రభుత్వ అధికారులు అర్ధం చేసుకుంటారు. పూయి వాంగ్మూలాన్ని కూడా తీసుకుంటారు. జైలులో ఉంటున్న పూయికి ఏ చిన్న పని చేయడం రాదు. నీళ్ళ టాప్‌ కట్టేయడం, షూలేస్‌ కట్టుకోవడం చివరకు కోటు బటన్లు పెట్టుకోవడం కూడా అతని సేవకుడే చేస్తాడు. ఇది గమనించి ఆ సేవకుడిని విడుదల చేసి పంపిస్తారు అధికారులు. అక్కడ క్రమంగా సాధారణ జీవితం జీవించడం నేర్చుకుంటాడు పూయి. చెట్ల పని ఇష్టంగా చేయడం మొదలెడతాడు.
రాజకీయ ఖైదీల కోసం కమ్యూనిస్ట్‌ రీ-ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం కింద, రెండవ చైనా-జపనీస్‌ యుద్ధంలో జపనీస్‌ ఆక్రమణదారులతో పూయి స్నేహం గురించి అధికారులు అతన్ని ప్రధానంగా ప్రశ్నిస్తారు. ఫుషున్‌ జైలు వార్డెన్‌, జిన్‌ యువాన్‌తో తీవ్ర చర్చలు జరిపిన తర్వాత, జపనీయులు చేసిన యుద్ధకాలపు దురాగతాలను వివరించే చలన చిత్రాన్ని చూసిన తరువాత, పుయీ జపాన్‌తో స్నేహం చేయడం తన తప్పని ఒప్పుకుంటాడు. జపాన్‌తో తన సంబంధాన్ని త్యజిస్తాడు. దీనితో ప్రభుత్వం తరుపున పునరావాసం పొందినట్టు నిర్ణయించి అతన్ని 1959లో విడుదల చేస్తారు.
చాలా ఏండ్ల తరువాత చైనాలో మావో జెడాంగ్‌ సాంస్కతిక విప్లవం పుంజుకుం టుంది. మావో ఆరాధకులు పెరుగుతారు. పూయి ఒక సాధారణ తోటమాలిగా జీవిస్తూ ఉంటాడు. ఒక రోజు నగరంలో యువత ఓ పరేడ్‌ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ పరేడ్‌లో దోషిగా ఊరేగిస్తున్న ఖైదీల్లో ఒకరిగా జిన్‌ యువాన్‌ను పూయి చూస్తాడు. తన రీ ఎడ్యుకేషన్‌ రోజుల్లో అతను తనతో ఒపిగ్గా జరిపిన చర్చలు అతనికి గుర్తుకు వస్తాయి. అతను మంచివాడని ఆ గుంపులోని యువకులకు చెప్పబోతాడు. కాని అతన్ని ఎవరూ పట్టించుకోరు.
ఇంకొన్నాళ్ల తరువాత పూయీ నిషిద్ధ నగరాన్ని సందర్శిస్తాడు, ఇప్పుడు ప్రభుత్వం దాన్ని మ్యూజియంగా మార్చింది. తాను ఒకప్పుడు చక్రవర్తిగా కూర్చున్న సింహాసనాన్ని చూసి దానిపై కూర్చోబోతాడు. ఒక అబ్బాయి అతన్ని వారిస్తాడు. పూయీ తాను అక్కడ అంతకు ముందు కూర్చున్నానని చెప్తూ ఆ సింహాసనం కింద అరవై ఏండ్ల క్రితం తాను చిన్నపిల్లవాడిగా ఓ డబ్బాలో దాచిన కీటకాన్ని తీసి ఆ పిల్లవాడికి ఇచ్చి వెళ్లిపోతాడు. తరువాత అదే చోట కొన్నాళ్లకు ఓ గైడ్‌ టూరిస్టులకు ఆ గది చూపుతూ ఆ సింహాసనంపై కూర్చున్న ఆఖరు చక్రవర్తి పేరు పూయి అని, అతను 1967లో మరణించాడని చెప్తూ ఉండగా సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాలో రాచరికపు వ్యవస్థలోని అరాచకాలను చూపిస్తూనే, చక్రవర్తుల నిస్సహాయతను దర్శకుడు చాలా విపులంగా చిత్రీకరించాడు. అలాగే చాలా విషయాల్లో వాళ్ళు కేవలం వ్యవస్థలో పావులుగా వ్యవహరించడం కనిపిస్తుంది. రాచరికపు జీవితాల వెనుక ఉండే చీకటి కోణాలను ఈ చిత్రం వివరంగా చుపిస్తుంది. ఉత్తమ చిత్రంతో పాటు తొమ్మిది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయి అన్ని అవార్డులను గెలుచుకుంది ”ది లాస్త్‌ ఎంపరర్‌”. బర్నాడో బర్టులుసి ఇటాలియన్‌ దర్శకుడు. ఈ చిత్రంతో ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకుని ఆ ఘనత సాధించిన మొదటి ఇటాలియన్‌ దర్శకుడిగా చరిత్రకెక్కాడు. పూయి పాత్రను చేసిన నటుడు పేరు జాన్‌ లోన్‌. చైనా లో పుట్టిన ఇతను ఓ అనాధ. చైనాలో కొన్నాళ్లు ఉండి పెంపుడు తల్లి అండతో ఒపెరాలో ట్రైన్‌ అయ్యాడు. తరువాత ఓ కుటుంబం స్పాన్సర్‌ చేయగా అమెరికా వెళ్లి హాలివుడ్‌లో తన అదష్టం పరీక్షించుకున్నాడు. చైనీయుడిగా శరీర ఆకతి ఉండడంతో ఇతనికి చాలా రోజులు ప్రధాన పాత్రలు లభించలేదు. కానీ ఈ సినిమాతో సినీ ప్రేమికుల మనసులో శాశ్వతంగా నిలిచిపోయాడు. పూయి పాత్రలో ముగ్గురు బాల నటులు కనిపిస్తారు. పట్టాభిషేకం దాకా మూడేండ్ల పూయిగా రిచర్డ్‌ వు కనిపిస్తాడు. తరువాత తమ్ముడితో ఆడుకుంటున్న పూయి గా టిజ్గెర్‌ ట్శో కనిపిస్తే ఆ తరువాత జాన్స్టన్‌ దర్రగ విద్య అభ్యసిస్తూ వూ టావ్‌ పూయిగా కనిపిస్తాడు.
ఈ సినిమా మొత్తం మూడు గంటల నలభై నిముషాల నిడివి ఉంటుంది. దాన్ని 163 నిముషాలకు కుదించారు. కానీ సినీ ప్రేమికుల కోసం పూర్తి సినిమా డీ.వి.డీ రూపంలో దొరుకుతుంది.
పి.జ్యోతి
98853 84740