ప్రజాస్వామ్య దేశంలో అన్ని అంశాలపై చర్చించేందుకు వేదికగా పార్లమెంట్ ఉండాలి. ప్రజలకు అవసరమైన వివిధ చట్టాలను ప్రవేశపెట్టడం, సమగ్రమైన చర్చ జరిగి, అధికార, విపక్ష పార్టీల సభ్యులు సూచించిన ఆమోదయోగ్యమైన సలహాలు పరిగణనలోకి తీసుకోవడం అధికారపక్షం బాధ్యత. కానీ ఇటీవల కాలంలో అలా జరగటం లేదు. బీజేపీ సొంత అజెండాలకు, పట్టింపులకుపోయి, సభా సమయాన్ని వృథాచేస్తోంది. గత పార్లమెంటు సమావేశాల్లో ”అదానీ” ఆర్థిక వ్యవహారాలపై జేపిసి వేయాలని విపక్షాలు పట్టుబట్టినా ఏమాత్రం లెక్కచేయకుండా కాలం వెళ్లదీసింది. ఇప్పుడు కూడా అదేతీరున వ్యవహరిస్తోంది. మణిపూర్ అమానుష సంఘటనపై ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో దేశ ప్రధాని మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతున్నా నేటికీ ప్రధాని మాట్లాడకపోవడం శోచనీయం. ఎలాగైనా ప్రధాని చేత మాట్లాడించాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో విపక్షాలకు బలం లేకపోయినా, ప్రధాని చేత నోరు విప్పించాలని, వాస్తవాలు వెలుగులోకి రప్పించాలని ఒకే ఒక్క ఉద్దేశంతో అవిశ్వాస తీర్మాన నోటీసును ప్రవేశపెట్టాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 28వ అవిశ్వాస తీర్మానం నోటీసు, ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి 2వ అవిశ్వాస తీర్మానమిది. స్పీకర్ ఆమోదం పొందడంతో త్వరలో చర్చ, ఓటింగ్ జరగనుంది. 1962లో చైనా చేతిలో భారత్ ఓడిన సందర్భంగా ఆచార్య కృపలాని, అప్పటి ప్రధాని నెహ్రూపై 1963లో అవిశ్వాస తీర్మానం మొదటి సారిగా ప్రవేశపెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రిపై మూడుసార్లు, అత్యధికంగా ఇందిరాగాంధీ పై 15సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కేవలం ఒకే ఒక ఓటు తేడాతో వాజ్‌పారు ప్రభుత్వం పడిపోయిన సందర్భం కూడా దేశానికి తెలిసిందే. ప్రస్తుతం ఈశాన్య రాష్రమైన మణిపూర్‌లో అనేక హింసాత్మక ఘటనలు జరుగుతున్నా, గత మూడు నెలలుగా మంటల్లో కాలిపోతున్నా అధికారంలో ఉన్న ప్రధాని కనీసం ఒకసారైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడం బాధాకరం. కనీసం వాస్తవ పరిస్థితులు దేశ ప్రజలకు పార్లమెంటు వేదికగా తెలపకపోవడం శోచనీయం. ప్రతిపక్షాల ఒత్తిడి చేసినా నోరువిప్పకపోవడంతో, ఇక ఆఖరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం ద్వారా, ప్రధాని చేత మాట్లాడించాలని నిర్ణయించారు. గెలుపోటములు ఎలాగున్నా, దేశంలో జరిగే వివిధ సమకాలీన సమస్యల్ని ఉద్దేశించి పాలకులు ప్రజలకు వివరించాలి. అనుమానాలను, భయభ్రాంతులను పటాపంచలు చేయాలి. అన్యాయం జరిగినవారికి ధైర్యం, భరోసా ఇవ్వాలి. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి నడుపుతున్న పార్లమెంటు, వివిధ రాష్ట్రాల శాసనసభల, శాసనమండలి సమావేశాలు ప్రజా సమస్యలు చర్చించేందుకు, అభివృద్ధికి వేదికలుగా ఉపయోగించుకుంటేనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరు ఉంటుంది. అంతే తప్ప ఊకదంపుడు మాటల వల్ల, ఉత్తుత్తి ప్రసంగాల వల్ల కాదనే విషయాన్ని కేంద్ర పాలకులు గ్రహించాలి.
– ఐ.పి.రావు