జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాద దంపతులపై భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తు న్యాయవాదులు చేస్తున్న నిరసన, ఆందోళన శుక్రవారం రెండవ రోజు కొనసాగిందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పెడరేషన్ ఆప్ బార్ అసోసియేషన్స్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.శుక్రవారం రోజున జిల్లాకోర్టు చౌరస్తాలో న్యాయవాదుల మానవహారంతో మానవతా విలువలు పోలీసులకు గుర్తు చేసినట్లు తెలిపారు. చట్టాన్ని రక్షించాల్సిన జనగామ పోలీసులు,చట్ట విరుద్ధంగా వ్యవహరించడం క్షమించరాని నేరమని జగన్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన పోలీసులే క్రిమినల్ చర్యలకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు.జనగామ లోని న్యాయవాదులు కోర్టు ఉత్తర్వుల మేరకే వాటి సమాచారాన్ని తెలియజేయడానికి వెళ్లారని కానీ పోలీసులు రాక్షసుల వలే వ్యవహరించడం వారి నేరమయ వ్యవహారశైలిని తెలియజేస్తుందని అన్నారు. ఆందోళన కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి సురేష్ దొన్పల్,కోశాధికారి దీపక్, న్యాయవాదులు రజిత,శ్రీధర్, గైక్వాడ్, సుదర్శన్ రావు,సాయిలు, మానిక్ రాజు,వినయ్ కుమార్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.