దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీతారాం ఏచూరి మరణం తీరని లోటని ‘న్యూస్‌క్లిక్’ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ చెప్పారు. ఏచూరి ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహిం చారని, దేశంలో లౌకిక, ప్రజాతంత్ర శక్తుల కలయికకు వారధిలా పనిచేశారని కొనియాడారు. ఏచూరితో తన కున్న అనుబంధాన్ని, జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పోర్టల్‌లో ప్రబీర్ ఓ వ్యాసం రాశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే….
ఎమర్జెన్సీ సమయంలోనూ, ఆ తర్వాత సీతారాం ఏచూరి జేఎన్‌యూలో విద్యార్థి మాత్రమే కాదు. నాయకుడు కూడా. ఆ సమయంలో నేను కూడా జేఎన్‌యూ విద్యార్థినే. జేఎన్‌యూ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఇందిరా గాంధీకి వర్సిటీ విద్యార్థులు రాసిన లేఖను ఆయన చదువుతున్న చిత్రం ఆ సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది. నాటి సీతారాం మాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఏచూరి చిరునవ్వే ఆయనకు ఎంతో మంది స్నేహితులను ఇచ్చింది. తొలుత విద్యార్థి నేతగా, ఆ తర్వాత పార్టీ నేతగా, దేశంలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు నాయకుడిగా సీతారాం అనేక వారధులు నిర్మించారు. రాజకీయ కూటములు ఏర్పాటుచేశారు. సీతారాంతో విభేదించే వారు సైతం ఆయనను గౌరవించే వారు. ఆయన మరణం అశని పాతం. అంతకంటే ఎక్కువ కూడా. ఎందుకంటే స్వాతంత్రోద్యమ కాలం నుండి మనం వారసత్వంగా పొందిన దేశ మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వాటిని ప్రతిఘటిం చేందుకు విశాల కూటములు ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులలో సీతారాం మరణించడం తీరని లోటేనని చెప్పాలి.
సంఘీభావాలు… ఆందోళనలు
మా విద్యార్థి రోజులలో…నేను, సీతారాం…మాకు అవసరమైన విద్య కోసం పోరాడడంతోనే సరిపెట్టు కోలేదు. రైతులు, కార్మికులకు సంఘీభావం తెలియజేశాము. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన వియత్నాం ఆందోళనకు మద్దతు తెలుపుతూ ప్రదర్శన నిర్వహించాము. చిలీలో అలండే ప్రభుత్వాన్ని కూలదోసి క్రూరమైన పినోచెట్ పాలనను తీసుకొచ్చేందుకు జరిగిన కుట్రను నిరసించాము. దేశంలో జరిగిన రైల్వే సమ్మెకు విద్యార్థులు…ముఖ్యంగా జేఎన్‌యూ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఢిల్లీలో జరిగిన వస్త్ర పరిశ్రమ కార్మికుల సమ్మెకు కూడా మద్దతు ఇచ్చారు. పినోచెట్ కుట్ర తర్వాత జరిగిన కిస్సింజర్ పర్యటనను నిరసించారు. వియత్నాం ప్రజలకు బాసటగా నిలిచారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన సమయంలో జేఎన్‌యూ విద్యార్థి యూనియన్‌కు ఏచూరి తొలిసారి అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాతి ఏడాదిలో రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు.
‘సంస్కరణల’ ముసుగు తొలగించారు
మా విద్యార్థి జీవితం ముగిసే సమయంలో పార్టీకి భవిష్యత్ నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసర మున్నదని మా పాతతరం నేతలు నిర్ణయించారు. 1984లో జరిగిన పార్టీ 8వ జాతీయ మహాసభలలో ప్రకాష్ కరత్, సీతారాం ఏచూరిలకు కేంద్ర కమిటీలో స్థానం కల్పించారు. ఆ తర్వాత వారు పొలిట్‌బ్యూరోలో చేరారు. స్వాతంత్రోద్యమ కాలం నాటి నాయకులకు, కొత్త తరానికి మధ్య కీలక అనుబంధం ఏర్పడడానికి ఈ నిర్ణయం ఉపకరించింది. స్వాతంత్రోద్యమ కాలం నాటి నాయకులతో పోలిస్తే మా తరం ఎదుర్కొన్న సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో బలమైన లౌకిక ఆధారాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ‘సరళీకరణ’ నినాదాన్ని అందిపుచ్చుకుంది. వలస పాలకులు వదిలి వెళ్లిన పేదరికాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని ఆ పార్టీ పట్టించుకోలేదు. ఆర్థిక అంశాలలో బలమైన పట్టున్న సీతారాం ‘సంస్కరణల’ ముసుగును తొలగించే బాధ్యతను చేపట్టారు. ప్రభుత్వ రంగాన్ని బడా పెట్టుబడిదారులకు విక్రయించడమే ఈ సంస్కరణల లక్ష్యం. దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ఏచూరి చేసిన రచనలు, నయా ఉదారవాదంపై ఆయన సునిశిత విమర్శలు పార్టీ కార్యకర్తల ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి…
అంతర్జాతీయ స్థాయిలో సోషలిస్టు దేశాలు బలహీనపడ్డాయి. అమెరికా సామ్రాజ్యవాదం అంతరించి పోదన్న నమ్మకం పెరిగింది. అమెరికా పంచన చేయడం మినహా మరో దారిలేదని మన రాజకీయ వర్గం విశ్వ సించింది. అలీనోద్యమానికి, తృతీయ ప్రపంచానికి సంఘీభావం తెలిపే విషయంలో మౌనముద్ర వహించింది. అమెరికాతో అంటకాగాలని బీజేపీ కూడా వాదించడం ప్రారంభించింది.
దేశ ఆర్థికవ్యవస్థను పూర్తిగా పెట్టుబడి దారుల చేతిలో పెట్టాలని చెప్పింది. మరో మాటలో చెప్పాలంటే ఇవాళ మనం చూస్తున్న క్రోనీ కాపిటలిజం వైపు సాగాలని సూచించింది. ఈ పరిస్థితులలో సీతారాం మరోసారి నడుం బిగిం చారు. బీజేపీ విభజన రాజకీయా లను వ్యతిరేకించే శక్తులన్నింటినీ కలిపేందుకు కృషి చేశారు. అన్ని వర్గాలనూ సంప్రదించే సామర్థ్యం కలిగిన సీతారాం దేశ లౌకిక స్వరూపాన్ని, స్వభావాన్ని కాపాడేందుకు అలుపెరుగని కృషి చేశారు. ఆయన ప్రయత్నాల ఫలితం ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో కన్పించింది.
లక్ష్యం దిశగా సాగడమే నివాళి
అయితే ఏచూరి లక్ష్యం ఇంతటితో ముగిసిపోలేదు. మనం సాగాల్సిన స్పష్టమైన దిశను ఆయన నిర్దేశిం చారు. ఇందుకోసం సీతారాం తన జీవితాన్ని పొదుపు చేసుకోకుండా ఖర్చు చేశారు. ఈ ప్రపంచం అణచివేత నుండి విముక్తి పొందాలని ఆయన జీవిత పర్యంతం తపనపడ్డారు. ఆయన పోరాటాన్ని మనమందరం ముందుకు తీసికెళ్లాల్సిన అవసరం ఉంది. అదే ఆయనకు మనం అర్పించగలిగే అసలైన నివాళి.
– ప్రబీర్ పురకాయస్త