– ఆయన ఆశయ బాటలో విప్పలమడక
నవతెలంగాణ-వైరా
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సీపీఐ(ఎం) నాయకులు విప్పలమడక మాజీ సర్పంచ్ గరిడేపల్లి వెంకటేశ్వర్లు ఆశయ బాటలో పయనించటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మంగళ వారం రాత్రి విప్పలమడక సీపీఎం కార్యాలయ ఆవరణలో గ్రామ శాఖ కార్యదర్శి కొల్లా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన అమరజీవి గరిడేపల్లి వెంకటేశ్వర్లు 18వ వర్ధంతి సభలో నున్నా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత పార్టీ స్థూపం వద్ద సర్పంచ్ జాన్ పాపయ్య ఎర్ర జెండా ఎగుర వేశారు. గరిడేపల్లి విగ్రహానికి నున్నా నాగేశ్వరరావు, భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు, రైతులకు అవసరమైన అన్ని రకాల సరుకులు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి గుల్ల చేస్తూ పెట్టుబడి దారులకు లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేస్తుందని విమర్శించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇచ్చి నంత బూటకంగానే దళిత బంధు పథకం ఉందన్నారు. పథకం ప్రభుత్వానిది అయినా అమలులో అధికారుల పాత్ర శూన్యమన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ, ఎమ్మెల్యే ల చుట్టూ ఉన్న వారికి తప్ప ఏ నిజమైన దళితుడికి ఈ పథకం దక్కటం లేదని విమర్శించారు. బిసి, మైనార్టీ రుణాల కోసం గ్రామానికి 50 మంది దరఖాస్తు చేసుకుంటే 1, 2 ఇచ్చి గొప్ప పథకాలుగా చెప్పు కోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ రుణాలు ఇస్తామని వేలమంది నుండి దరఖాస్తులు తీసుకుని ఎంపీడీఓ స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన వారికి మూడేళ్లు గడిచి పోయిన వారికి రుణాలు మంజూరు చేయలేదని, ఇప్పుడు చెప్పే రక రకాల బంధులన్నీ ఎన్నికల తర్వాత బంద్ అవుతాయన్నారు. కొత్త పెన్షన్ లు మంజూరు చేయనందున గ్రామాలలో వితంతువులకు కూడా పెన్షన్ పెన్షన్ రావటం లేదని, విప్పలమడక గ్రామంలోనే పెన్షన్ అందని వితంతువులు 10 మంది ఉన్నారని అన్నారు. ప్రచారం తప్ప ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలిచి పోరాడిన ఫలితంగానే, ఈ మాత్రమైనా సంక్షేమం అమలు జరుగుతుందన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూ నిరుపేదలు అధికంగా ఉన్న విప్పలమడక లో తెలంగాణ ప్రభుత్వం 2018లో 60 డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంఖుస్థాపన చేసి మొక్కు బడిగా 20 ఇళ్లకు స్లాబులు వేసి అసంపూర్తిగా వదిలేశారన్నారు. ఈ సభలో సీపీఎం మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు, గ్రామ ఉప సర్పంచ్ ఎదుళ్ళ కృష్ణ కుమారి, సీనియర్ నాయకులు రుద్రాక్షల వెంకట చారి, గరిడేపల్లి శ్రీనివాసరావు, గరిడేపల్లి సుబ్బారావు, గరిడేపల్లి అనిల్ జి.పుల్లయ్య, వై.పుల్లయ్య, చావా వెంకటేశ్వరరావు, మోతిపల్లి రామారావు, ఇనపనూరి శ్రీను, రైతు సంఘం నాయకులు ద్రోనాదుల నాగేశ్వర రావు, ఎస్‌కే జానిమియా తదితరులు పాల్గొన్నారు.