శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నాడు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి రావి భద్రారెడ్డి ఫంక్షన్ హాలులో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ వారి 285 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా  ముఖ్యఅతిథిగా హాజరై,  మాట్లాడారు.  గిరిజన సాంప్రదాయ పద్దతిలో ముందుగా భోగ్ భండారు పూజకార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  సేవాలాల్ మహరాజ్ వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని, బంజారా కుటుంబాలలో వెలుగు నింపిన సేవాలాల్ చిరస్మరణీయులని, అహింసామార్గంలో ఆయన గడిపిన జీవిత విధానం అందరికి ఆదర్శమని అన్నారు. గిరిజనులలో కష్టపడేతత్వం ఉంటుందని, శ్రమనే నమ్ముకొంటారని, ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను గిరిజన సోదరులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. మన జిల్లాకు చెందిన కేతావత్ సోమలాల్  పద్మశ్రీ రావడం మన జిల్లాకే గర్వకారణమని అన్నారు. డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్ గిరిజన జాతికి అందించిన సేవలను అందరం గుర్తుంచుకోవాలని, ఈ సంవత్సరం భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో బంజారా ముద్దుబిడ్డ మన జిల్లాకు చెందిన కేతావత్ సోమలాల్ రావడం జంజారా జాతికే కాక భారతదేశానికే గర్వకారణమని, అయన భగవద్గీతను బంజారా భాషలో వ్రాయడం అపూర్వమని అన్నారు. పట్టుదల ఉంటే జాతీయ స్థాయిలో గుర్తింపు కానీ అవార్డులు కానీ ఖచ్చితంగా వస్తాయని, తండాలు గిరిజన విధానానికి నిదర్శనమని, ప్రస్తుతం యువత తండాలను సందర్శించి గిరిజన జీవన విధానంపై, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలని, బంజారాభాష గర్వించదగినదని, దానిని బ్రతికించాలని తప్పయినా సరే గిరిజన భాషను మాట్లాడాలని, తప్పుల నుండే నేర్చుకుంటామని, మన భాషను ముందు తరానికి అందించాలని అన్నారు. అందరినీ చదివించాలని, 18 సంవత్సరాల లోపు పెళ్లిల్లు చేయరాదని, దురలవాట్లకు దూరంగా వుండాలని అకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, ఇన్ ఛార్జీ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి  ఎంఎ కృష్ణణ్, ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్,  ఎంపిపి నూతి రమేశ్, జిల్లా సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బానోతు రాములునాయక్, ఉపాధ్యక్షులు ధరావత్ సతీష్ నాయక్, ప్రధాన కార్యదర్శి బానోతు గోపీ నాయక్, కోశాధికారి రాజేంద్ర నాయక్, కార్యవర్గ సభ్యులు, గిరిజన ప్రతినిధులు, గిరిజనులు, ప్రజలు పాల్గొన్నారు.