చీకటికళ్ళతో ప్రపంచాన్ని చూడలేని ఓ అమాయకురాలు ప్రకృతితో తన బాధను విన్నవించుకుంటూ, అలుపెరుగని తన ప్రయాణంలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంటూ, అనాధగా తన జీవితాన్ని ఈడ్చుకుంటూ, కష్టాల కన్నీళ్ళను ఈదుకుంటూ పాడుకునే పాట ఇది. అంధురాలి మనోగతాన్ని, ఆ అనాధ దుర్భర జీవితాన్ని ఈ పాట అద్దంలో అద్భుతంగా చూపించారు డా.సి.నారాయణరెడ్డి. ఆ పాటనిపుడు చూద్దాం.
డా||సి.నారాయణరెడ్డి గొప్ప శబ్దబ్రహ్మ. అలతి అలతి పదాల్లో రాసినా, సంస్కృత సుదీర్ఘ సమాసాల్లో రాసినా ఎంతో గొప్ప కవితాత్మకతను నింపి రాస్తాడు. మధురమైన భావుకత్వంతో మనసుల్ని ఎంతో మృదువుగా పట్టేస్తాడు. 1975లో వచ్చిన ‘అనురాగాలు’ సినిమాలో ఓ హృదయ విదారకమైన పాటనొకటి రాశాడు. సినీనటి శ్రీదేవి కథానాయిక నటించిన తొలి సినిమా ఇదే.
పాట వింటున్నంతసేపు కళ్ళవెంట నీళ్ళువస్తాయి. కళ్ళులేని ఓ అమాయకురాలు తన బాధను, గోడును పాటలో తెలుపుతుంది. ఆమె అనాధ కూడా. ఏ తోడు లేదు. నా అన్నవాళ్ళు లేని అభాగ్యురాలు. ఆమె జీవితమంతా పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అంధురాలు తన జీవితాన్ని గూర్చి చెప్పే సందర్భం ఇది.. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి సమాసాలు వేయడం కుదరదు. దీనంగా చిన్న చిన్న పదాల్లోనే భావాన్ని వ్యక్తం చేయాలి. సన్నివేశాన్ని అక్షరీకరించడంలో సినారె ని మించిన కవిలేడు. అందుకే.. ఇక్కడ సందర్భానికి తగినట్టుగా మామూలు మాటల్నే వాడాడు.
నాకు ఏ తోడు లేదు. నా అనుకునేవాళ్ళు ఎవరూ లేరు. నన్ను ప్రేమించేవాళ్ళు, నా పై జాలిచూపించేవాళ్ళు అసలే లేరు. ఉండడానికి ఏ నీడ కూడా లేదు. ఈ సృష్టిలోని ఏ అందాన్ని కూడా నేను చూడలేను.. నేను అంధురాలిని.. మరి నాతో ఆడుకునేది, నన్ను లాలించేది ఎవరు? కేవలం చల్లగాలి మాత్రమే ప్రేమగా తల్లిలాగా నన్ను నిమిరి ఓదారుస్తుంది. పిల్లగాలి నాకు తోడుగా ఆడుకుంటుంది. నా వెంట నడిచివస్తుంది అంటూ బాధతో పాడుతుందామె.
ఆమె తన కళ్ళతో ప్రపంచంలోని ఏ అందాన్నీ చూడలేదు. ఏ ఆనందాన్నీ పొందలేదు. కాకపోతే అందరూ ఆ అందాల్ని గూర్చి వేనోళ్ళ చెప్పుకుంటే విన్నది అంతే. అందుకే ఆ విషయాన్నే ఇక్కడ స్పష్టం చేస్తుంది. మల్లెపూలు తెలుపురంగులో ఉంటాయని అందరూ అంటుంటే విన్నాను. కాని కళ్ళతో చూడలేదు. బంతిపూలు పసుపురంగులో ఉంటాయని అంటుంటే విన్నాను. కుంకుమ ఎరుపురంగులో ఉంటుందని చెబుతుంటే విన్నాను. కాటుక నలుపురంగులో ఉంటుందని అంతా అంటుంటే విన్నాను.. తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు ఇలా ఇన్ని రంగులున్నా, ప్రకృతిలో ఇన్ని అందాలున్నా ఏం లాభం? నాకు మాత్రం ఉన్నదేమిటి? రాత్రి, పగలు తేడా లేదు. ఒక్క కటిక చీకటే కదా నా కంటి నిండా… అని తన కంటి చీకటిని గూర్చి, తన బతుకులోని చీకటిని గూర్చి బాధతో పాట రూపంలో చెబుతుంది. ఎవరు ఎన్ని రంగులు గూర్చి చెప్పినా, ఎవరు ఎన్ని అందాల గూర్చి వివరించినా అవి నేను చూడలేను కదా! అనే నిరాశా భావనను స్పష్టంగా ఆవిష్కరిస్తుంది. తన హృదయంలోని ఆవేదనాతత్త్వాన్ని పాట రూపంలో మన కళ్ళముందుంచుతుంది.
వసంతమాసాలు ప్రతి సంవత్సరం వస్తాయని అంటారు. ఉదయాలు ప్రతిరోజు వస్తాయని చెబుతారు. నక్షత్రాలు ప్రతి రాత్రి వస్తాయని అంటుంటారు. అలలు ప్రతిక్షణం వస్తుంటాయని అంటారు. ఒకటేమో సంవత్సరానికొకసారి వస్తే, ఒకటేమో రోజు వస్తుంది. మరొకటేమో ప్రతి రాత్రి వస్తే, ఇంకొకటేమో ప్రతి క్షణం వస్తాయి. ఇవన్నీ మార్పులే కదా! నిత్యం జరుగుతున్నవే కదా! ఇన్ని మారుతున్నప్పటికీ ఒక్కటే మారడం లేదు. అదే నా బతుకు. సృష్టిలో అన్నింటికీ మార్పు ఉన్నా తన బతుకుకు మార్పు లేదు. తన బతుకులోని బాధ, తన కళ్ళలోని చీకటి తొలగిపోదా? తన కళ్ళనిండా కాంతిగంగ ప్రవహించదా? అనే బాధ, నిరాశ ఈ పాటలో కనిపిస్తాయి. అయితే.. ఇన్ని మారినట్టుగానే తన బతుకు కూడా మారుతుందనే ఆశావాహ దృక్పథం కూడా పాటలో తొంగి చూస్తుంది.
ఇది కేవలం సినిమా కోసం రాసిన పాటలా కనబడుతున్నా నేటికీ ఇలాంటి పరిస్థితులు ఎన్నో మన కళ్ళముందు కనబడుతున్నాయి. ప్రపంచంలో ఎంతోమంది అభాగ్యులు, దుర్బలులు ఇలాంటి దౌర్భాగ్య జీవితాల్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అంధులుగా కొంతమంది, అనాధలుగా మరి కొంతమంది కన్నీటి జీవితాల్ని గడుపుతున్నారు. వారి జీవితాలన్నింటికి అక్షరరూపంగా, దృశ్యమానంగా ఈ పాట కనిపిస్తుంది. ప్రపంచంలోని దీనులంతా కలిసి తమ బాధను విన్నవించుకుంటున్నారా అన్నంత హృదయవిదారకంగా ఈ పాట ఉండడం విశేషం..
పాట:-
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు/ ఈ ఇలలోని అందాలు నే చూడలేను/ చల్లగాలి ఆగిపోవే/ పిల్లగాలీ తోడు రావే/ మల్లెపూలు తెలుపని అంటారు /బంతిపూలు పసుపని అంటారు/ కుంకుమ ఎరుపని అంటారు/ కాటుక నలుపని అంటారు/ ఇన్ని వన్నెలున్నా నాకున్నదేమిటి?/ నా కన్నులలో పగలు రేయి కటిక చీకటి/ చల్లగాలి ఆగిపోవే/ పిల్లగాలీ తోడు రావే/ వసంతాలు ప్రతియేట వస్తాయి/ ప్రభాతాలు ప్రతి రోజు వస్తాయి/ తారకలు ప్రతి రేయి వస్తాయి/ తరంగాలు ప్రతి క్షణం వస్తాయి/ ఇన్ని మారుతున్నా నా బతుకు మారదా?/ నా కన్నులలో కాంతిగంగ వెల్లివిరియదా?/ చల్లగాలి ఆగిపోవే పిల్లగాలీ తోడు రావే..
– డా||తిరునగరి శరత్‌చంద్ర, sharathchandra.poet@yahoo.com