సమాజ చైతన్య దీప్తి

‘సభలచే రాణించిన వాడు కాదు, సభలను రాణింపజేసిన మనిషి. వాడు చరిత్రకారుడే కాదు వాడు స్వయంగా ఒక చరిత్ర’ అంటూ కాళోజీచే కీర్తించబడిన తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వార్‌ స్వామి. నిరంకుశ ప్రభువులను జయించడానికి ప్రజా విప్లవం మినహా మరో దారేది లేదని, భావజాల వ్యాప్తి ద్వారానే ప్రజావిప్లవం రాగలదని, అందుకు అధ్యయనమే బలమైన పునాది వేయగలదని, అధ్యయనశీలురే ప్రాపంచిక బోధనలు చేయగలరని ప్రగాఢంగా నమ్మి గ్రంథ ప్రచురణ, పంపిణీలను పూనికతో చేపట్టిన మహనీయుడు వట్టికోట ఆళ్వార్‌ స్వామి.

అఖండ భారతంలో హైదరాబాదు రాష్ట్రంలో రాచరికం కొనసాగడాన్ని నిరసించి తదనుగుణ ఇతివత్తాలనెంచుకొని ఉత్కష్ట రచనలు వెలువరించిన మహా సజనకారుడు వట్టికోట ఆళ్వార్‌స్వామి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు మరల ఆ చీకటి రోజులనే తలపిస్తున్నాయి. పురోగమనంలో అభివద్ధి ఫలాలు అందుకోవాల్సిన దేశాన్ని తిరోగమనంలోకి నెడుతున్న పాలకుల తీరుకు వ్యతరేకంగా ప్రజా సాంస్కృతిక విప్లవం తీసుకురావడమే ఇప్పుడు మనముందున్న కర్తవ్యం. దీనికి వట్టికోట మనకెంతో ప్రేరణనిస్తారు.
తెలంగాణ గ్రామీణ గర్భంలో ఒక చారిత్రక సందర్భంలో జరిగిన పరిణామాలను అత్యంత వాస్తవికంగా ప్రతిభావంతంగా రెండు నవలల్లో చిత్రించిన వట్టికోట ఆళ్వారుస్వామి, క్షేత్రస్థాయి సామాజికార్థిక సంబంధాలను ప్రతిఫలింపజేశారు. నవలా రచయితగా ‘రామప్ప రభస’ లాంటి రచనలు ఆళ్వారుస్వామి ఆలోచనల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ‘జైలు లోపల కథలు’లో నేరం – శిక్ష, నేరాన్ని చూసే పద్ధతి, నేరస్తులలో వచ్చే సంక్షోభం గురించి అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రస్తుత పాలకులలో కూడా నేరాన్ని చూసే పద్ధతి వేరుగానే ఉంది. అంతేకాదు అన్యాయమైన ఆరోపణలతో ప్రజాజీవితంలో ఉండే వారిని జైలు లోపలికి పంపుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ప్రశ్నించడం కూడా నేరంగా మారిపోయిన దుర్భర వ్యవస్థలోకి మనం నెట్టబడి ఉన్నాం.
వట్టికోట రచయితగానే కాదు, నిత్యం ప్రజల సమస్యలపై పోరాటాం చేసేవారు. నగర ప్రాంతంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శ్రమించారు. 1944లో గుమస్తాల సంఘాన్ని నెలకొల్పి వెట్టి చాకిరీకి దగ్గరగా బతుకులీడుస్తున్న కార్మికులకోసం వారానికొక సెలవు దినాన్ని, ఇతర రాయితీలను పోరాటం చేసి సాధించారు. వారి కోసం ‘గుమాస్తా’ పత్రికసైతం నడిపారు. 1946లో హైదరాబాదులోని రిక్షాలను నిజాం సర్కారు రద్దు చేయడానికి సిద్ధమైందని తెలిసిన వెంటనే రిక్షా కార్మికులందరిని ఏకం చేసి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దాక పోరాటం చేశారు. రైల్వేశాఖ తాత్కాలిక ఉద్యోగులను తీసివేసినప్పుడు ఆళ్వార్‌స్వామి వారితో కలిసి ఉద్యమం కొనసాగించారు. వట్టికోట కేవలం రచయితే కాదు పోరాటశీలి కూడా. ఏదైనా ఒక ప్రజాసమస్య ముందుకు వస్తే కేవలం దాన్ని తమ రచనలు ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావడం ఒకటే తన పని అని ఆళ్వార్‌ స్వామి భావించలేదు. ఆ భాధితుల పక్షాన నిలబడి పోరాటలకూ వెనుదీయలేదు.
1938 నుంచి 1961లో చనిపోయే వాటి వరకు తెలంగాణ చైతన్యానికి, పోరాటానికి అనునిత్యం పాటుబడ్డ నిస్వార్థత్యాగి ఆళ్ళారుస్వామి. ఆయన కథలు, నాటికలు, నవలలు రాశాడు. మొదటి నవల దేశోద్ధారక గ్రంథమాల తరపున 1955 జనవరిలో ప్రచురితమయింది. దాని పేరే ‘ప్రజల మనిషి’. ఈ నవలలో తెలంగాణ జనసామాన్యంతో పాటు, సర్వ సామాన్యంగా అందరూ మాట్లాడే భాషను సంభాషణల్లో రాశారు. ‘గంగు’ నవల ‘ప్రజల మనిషి’కి కొనసాగింపు, గంగు నవలలో కమ్యూనిస్టు పార్టీ తెచ్చిన చైతన్యం, పోరాట స్ఫూర్తి వర్ణించబడినాయి. వట్టికోట వారు ఎక్కడ ఉన్నా అక్కడి దుర్వ్యవస్థను బాగు చేయాలని తపన పడ్డాడు. జైలులో వున్న పరిస్థితులను చూసి స్పందించారు. ఆయన జైలులో ఉన్న జైదీల జీవిత నేపథ్యం చేత చలించిపోయి వట్టికోట ‘జైలు లోపల’ కథలను రచించారు. ఈ కథలు నిజంగా జరిగిన సంఘటనలు. నిజమైన జీవితాల చేత ప్రేరణను పొంది రాసిన కథలే. కొన్ని కథల్లో ఖైదీల సామాజిక జీవితం నేపథ్యం అయితే, కొన్ని కథల్లో రాజకీయ పరిణామాలు నేపథ్యంగా వున్నాయి. 1946-51లో జైలులో వున్నప్పుడు రాసిన కథలను 1952లో ‘జైలు లోపల’ పేరుతో దేశోద్ధారక గ్రంథమాల 13వ ప్రచురణగా అంటే జైలు నుంచి విడుదల కాగానే గ్రంథమాలను పునరుద్ధరించి, దాని తరుపున ఈ కథల సంపుటిని ప్రచురించారు. దీనిలో ఆరు కథలు ఉన్నాయి. ఇవి గాక ‘సుజాత స్రవంతి, తెలుగుతల్లి’ మొదలైన పత్రికల్లో ‘ధర్మారాజు’ వంటి కలం పేర్లతో వట్టికోట రాసిన కథలు 15 దొరుకుతున్నాయి.
ప్రజాస్వామ్య భావన, దోపిడీ దురాగతాలపై తిరుగుబాటు, స్వాతంత్య్రేచ్ఛ ఆళ్వారు స్వామి రచనల్లో త్రివేణీ సంగమంలా అమరాయి. రచన కోసమే రచనలు చేసినవాడు కాదు, రాజకీయాల కోసమే రాజకీయాలు మాట్లాడినవాడు కాదు. ప్రజల దీన, హీనస్థితిని కళ్లారా చూసి హృదయం చలించి ప్రజల పక్షాన పెన్ను, గన్ను పట్టిన వాడాయన. దొడ్డి కొమురయ్య అమరత్వం, కడివెండి సంఘటన ఆయనలో మరింత సమరశీలతను నింపినై. అభ్యుదయ రచయితల సంఘ స్థాపనలో ఆళ్వార్‌స్వామి కషి విస్మరించరానిది. ‘గోలకొండ, మీజాన్‌, తెలుగు తల్లి, తెలంగాణ’ పత్రికలకు పని చేసిన అనుభవం ప్రజాసమస్యలను ఎట్లా ఎత్తి చూపాలో నేర్పింది. పరిసరాలు, పరిస్థితులు వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. పేదరికం పోరాట పటిమను నేర్పుతది అనడానికి వట్టికోట మనకో మంచి ఉదాహరణ. ఒక విద్యావంతుడు తన సమాజం గురించి ఎలా ఆలోచించాలో అలా ఆలోచించారు. ఒక ప్రజా పక్షపాతి సమాజానికి ఏమేం చేయవలసి ఉంటుందో అవన్నీ చేసారు. తెలంగాణ సాంస్కృతిక వైతాళికుడు మన వట్టికోట.
(నవంబర్‌ 1న వట్టికోట ఆళ్వార్‌ స్వామి 109వ జయంతి సందర్భంగా)
– అనంతోజు మోహన్‌ కష్ణ
8897765417