”ప్రకృతి, సమాజం వెనక్కు వెళ్లవు, సదా ముందుకే పరిణమిస్తుంటారు!” రుజువైన పరిణామ సిద్ధాంత మిది. అమీబా నుండి ఆధునిక మానవుని దాకా ప్రకృతి, ఆదిమ సమాజం నుండి, ఆధునిక ప్రజాస్వామ్యం! దాకా సమాజం పరిణమించినరు, ఇంకా ముందుకు పరిణమిస్తూనే ఉంటారు! ఎంతటి మేధావి, బలవంతుడు, నిరంకుశుడైనా, ప్రచార సాధనాలను తనలో బంధించుకున్నా సరే, సమాజాన్ని వెనక్కునెట్టలేడని, హిట్లర్ ద్వారా గ్రహించింది ప్రపంచం! రేపు మోడీ ద్వారా గ్రహించబోతున్నది భారత దేశం! పాట్నాలో రూపొందిన ప్రతిపక్షాల ఐక్యవేదిక అందుకొక సంకేతం! గత తొమ్మిదేండ్లుగా దేశాన్ని కమ్ముకున్న కారుమబ్బుల్లో, వెలిసిన ఆశల హరివిల్లుగా, ప్రతిపక్షాల ఐక్య వేదికను భావిస్తున్నారు ప్రజలు! అయితే ”ప్రతిపక్షాల ఐక్యత అసాధ్యం! మళ్ళీ 300సీట్లతో మోడీ ప్రధాని కావటం తథ్యం!!” అని సవాలు విసిరారు అమిత్‌షా. ఓవైపు మణిపూర్ మండుతున్నా, మరోవైపు రెజ్లర్లు ఆక్రోశిస్తున్నా నోరు విప్పరు నరేంద్రమోడీ! అదీ వాళ్ళ ధీమా! ఎందుకంటే? ప్రజల ప్రగతి కోసం పరిశ్రమించి వాళ్ళ అభిమానాన్ని, విశ్వాసాన్ని పొందటం కన్నా, వాళ్ళ మోజారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎన్నికల ఎత్తుగడలనే నమ్ముకున్నది బీజేపీ! అవే రెండుసార్లు వాళ్ళకధికారాన్ని కట్టబెట్టినరు! అందుకే ఆ ఎత్తుగడలనే మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా పయనిస్తున్నది బీజేపీ! అందులో కొన్నింటిని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
ఆశాజనక వాగ్దానాలతో, దేశభక్తి, దేశరక్షణ, సుస్థిర ప్రభుత్వ నినాదాలతో ప్రజలను సమ్మోహితులను చేయటం. నిరంతరం మత, జాతీయ భావోద్వేగాలకు ఆజ్యం పోస్తుండటం!, తరచూ పాకిస్థాన్-చైనాలను బూచీలుగా చూపించటం! మీడియా, సోషల్ మీడియాల ద్వారా మోడీ ఇమేజ్‌ని పెంచే దృశ్యాల, ప్రసంగాల మన్‌కీ బాత్‌ల వర్షాన్ని కురిపించటం! ఆయా రాష్ట్రాలలో హిందూ- ముస్లిం విద్వేషాలను సృష్టిస్తూ, మెజారిటీ ఓటర్లను తమ వైపు పోలరైజ్ చేసుకోవటం! దేశ సంపదను ఆశ్రిత కార్పొరేట్లకు కట్టబెట్టి, బాండ్ల రూపంతో వాళ్ళిచ్చే నిధులతో ఓటర్లను, బీజేపీయేతర ప్రజా ప్రతినిధులను ఆకర్షించటం! ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చటం! షిండేలను సృష్టించి, ఆయా పార్టీలను చీల్చి చెండాడటం! ఇవి బీజేపీ-ఆరెస్సెస్ వ్యూహాల్లో ప్రధానం. సమర్థవంతమైన బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్ల ద్వారా ఆటంకాలు సృష్టించటం! బీజేపీకి సానుకూల తీర్పులిచ్చిన విశ్రాంత న్యాయమూర్తులకు పదవులు కట్టబెట్టటం ద్వారా, న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయటం! తమను నిలదీసిన వారిని ‘ఉపా’ చట్టంతో నిర్బంధించటం. ఇలాంటి విధానాలు అనుసరిస్తూ, ఎత్తుగడల ద్వారా దశాబ్ద కాలంగా బీజేపీ అప్రతిహతంగా కొనసాగటం అందరికీ తెలిసిందే! ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు ప్రతికూలమైన అంశాలు. ఎందుకంటే ఇవి చేయడం బీజేపీకి వెన్నెతో పెట్టిన విద్య. అయితే ప్రతిపక్షాల సమైక్య పోరాటం విజయవంతం కావాలంటే, బీజేపీ బలాలు, బలహీనతల గూర్చి స్పష్టమైన అవగాహన అవసరం. ప్రజలకు బీజేపీ ఎత్తుగడలను గుర్తుచేయటం ఆ పార్టీవల్ల దేశానికి ఉన ముప్పును వివరించడం నేడు అనివార్యం. వామపక్షాలు మినహా బీజేపీని నిలదీయగలిగిన రాజకీయ నైతికత్వం పార్టీల్లో లోపించకుండా చూడటం, ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలను గమనిస్తూ బీజేపీ-ఆరెస్సెస్ విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయ విధానాలతో సలహాలు, సూచనలు చేయగలగాలి.
బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందన్న భరోసాను ప్రజలకు కలిగించగలిగిన ప్రతిపక్షాల ఐక్యవేదిక లేకపోవటం వలన దేశం ఇప్పటికే చాలా మూల్యం చెల్లించుకున్నది! ఈ నిరాశా నిస్పృహల కారుమబ్బులు కమ్ముకున్న భారతంలో, ఆశల హరివిల్లులా ప్రతిపక్షాల ఐక్యవేదిక ‘పాట్నా’లో ప్రత్యక్షమైంది! దీన్ని దేశానికి శుభసూచకంగా భావిస్తున్నారు ప్రజలు! ఎందుకంటే? ఐదు దశా బ్దాల క్రితం అలముకొన్న ఎమర్జెన్సీ చీకట్లలో జయప్రకాష్ నారాయణ నాయకత్వాన అదే ‘పాట్నా’లో రూపొందిన ప్రతి పక్షాల ఐక్య సంఘటన ఉప్పెనలా విజృంభించి, ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఊడ్చేసింది. ఇప్పుడది మోడీ ప్రభుత్వాన్ని మార్చుతుందనే నమ్మకం ప్రజలకు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. ఇన్నాళ్ళకు తిరిగి ‘పాట్నా’ లోనే వెలిసిన ప్రతిపక్షాల ఐక్యవేదిక, నేటి అప్రకటిత ఎమర్జెన్సీ గాడాంధకారం నుండి దేశానికి విముక్తి కలిగించగలదన్న ఆశను చిగురింపజేసింది! ‘పాట్నా’లో సమావేశమైన ప్రతిపక్ష నేతల ఒక్కోమాట ప్రతి భారతీయుని హృదయంలో ఒక్కో ఆశాదీపాన్ని వెలిగించిందనే చెప్పాలి. ‘రాహుల్ గాంధీ’: ‘భారతీయుల సమైక్యత! భారతీయుల విభజన!’ అనే రెండు విధానాల మధ్య జరుగుతున్న పోరాటంగా రాహుల్ చెప్పారు బీజేపీ విభజన వ్యతిరేక పోరాటానికి ప్రతిపక్షాలన్నీ చేతులు కలపడం వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించబో తున్నామని సంకేతాలిచ్చారు. రాజ్యాంగ మూల స్తంభాలపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించి, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవటమే లక్ష్యంగా ఉండాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సీపీఐ కార్యదర్శి డి రాజా బీజేపీది తొమ్మిదేండ్ల తిరోగమన పాలనగా వర్ణించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన పార్టీల నాయకత్వాన విపక్షాల ఐక్య కూటమి ఈ ఫాసిస్టు ప్రభుత్వంపై రణభేరి మోగిస్తుందన్నారు.
పాట్నా సమావేశంలో విపక్షాల ఐక్య కార్యాచరణ ప్రజలకు కొండంత సంతోషాన్ని, భరోసాను కల్పించాయి. జూలైలో నిర్వహించ నున్న ‘సిమ్లా’ సమావేశంలో ఐక్యకూటమి కన్వీనర్‌ను, ఉమ్మడి ప్రణాళికను రూపొందించు కోనున్నట్లు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీగా, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్ష కూటమి ఒకే అభ్యర్థిని పోటీకి నిలపాలని నిర్ణయించుకోవడం మంచి అంశం. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ విశాల దృక్పథంతో వ్యవహ రించాలన్నారు లాలూప్రసాద్! ఢిల్లీ ఆర్డినెన్స్‌ను ఖండిస్తేనే కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామన్నారు కేజ్రీవాల్! వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్‌తో సహా ఆయా అంశాలను ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా ప్రవేశపెడతా యన్నారు ఖర్గే! ఇలా ‘ప్రతి పక్షాల ఐక్య వేదిక’ భారతీయులకు సంతృప్తిని కలిగించింది! అయితే మరింత భరోసా కోసం ‘బీజేపీ ‘తిరోగమన విధానాలకు’ ప్రత్యామ్నాయంగా ‘ప్రగతి విధానాల’ ఎజెండాను కూడా ఆకాంక్షిస్తున్నారు ప్రజలు! అంతే కాదు, ఆగ్రహా వేశాలతో, ‘మోడీని గద్దె దించుతాం! బీజేపీని మట్టి గరిపిస్తాం!’ వంటి వ్యర్థ నినాదాలు, వ్యక్తిగత దూషణల కన్నా ‘బీజేపీ తిరోగమన విధానాలను, వాటి దుష్ఫలితాలను వివరించి, వాటికి ప్రత్యామ్నాయంగా తాము చేపట్టనున్న ప్రగతి విధానాల ప్రకటన ద్వారా, ప్రతిపక్ష కూటమి, ప్రజలను శక్తివంతంగా ప్రభావితం చేయగలు గుతుందని, అను భవజ్ఞులు సూచిస్తున్నారు! ‘ఈ ఐక్యవేదికను దేశభక్తి మహాపోరాటంగా భావించి ప్రతిపక్షాల ఐక్యవేదిక చిత్తశుద్ధితో కృషి చేస్తే మనల్ని విపక్షాలుగా గాక దేశభక్తులుగా భావిస్తారు ప్రజలు’ అని మమతా బెనర్జీ విశ్లేషించినట్టు, నిజంగానే ప్రజలు ఐక్యవేదిక వెంటే ఉంటారు. మతవిద్వేషాలతో పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు. ఇది తథ్యం!
– పాతూరి వెంకటేశ్వరరావు
9849081889