– జీవితకాల నిషేధం ఎత్తివేసిన సీఏ
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డెవిడ్ వార్నర్ బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో సిడ్నీ థండర్స్ జట్టుకు సారథ్యం వహించేందుకు మార్గం సుగమం అయ్యింది. 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో డెవిడ్ వార్నర్‌పై జీవితకాల నాయకత్వ బాధ్యతల నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. తాజాగా, సీఏ క్రమశిక్షణ కమిటీ ఆ నిర్ణయాన్ని సమీక్షించి ఎత్తివేసింది. స్వతంత్ర విచారణ కమిటీ ముందు పాట్ కమిన్స్, కేన్ విలియమ్సన్ సహా ఆసీస్ సహాయక సిబ్బంది, ఆటగాళ్లు వాంగ్మూలం ఇచ్చారు. డెవిడ్ వార్నర్ నాయకత్వంతో దేశవాళీ క్రికెట్‌లో యువ క్రికెటర్లకు మార్గ నిర్దేశనంగా ఉండనుందని, ఆసీస్ క్రికెట్‌కు వార్నర్ చేసిన సేవలను సైతం పరిగణనలోకి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఏ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీని సైతం వార్నర్ కోల్పోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.