ఆశా వర్కర్ల ప్రాణాలకు భరోసా కల్పించాలి

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్‌ డిమాండ్‌
– రెండవ రోజుకు చేరుకున్న ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
నవతెలంగాణ-ఆమనగల్‌
పేద ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఆశా వర్కర్ల ప్రాణాలకు భరోసా కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్‌ డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు చేపడుతున్న నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షులు కిషన్‌ సందర్శించి వారికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను. సైతం పణంగా పెట్టి పేద ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత ఆశా వర్కర్లకే దక్కుతుందని ఆరన ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన తొమ్మిదేళ్ళ పాలనలో నేటి వరకు ఆశా వర్కర్లకు కనీసం హెల్త్‌ కార్డులు కూడా అందజేయలేదనీ ఆరోపించారు. ఆశా వర్కర్లకు ప్రస్తుతం ఇస్తున్న పారితోషికాన్ని రూ.18 వేలకు పేంచి ఫిక్స్డ్‌ వేతనం అమలు చేయాలని, టీబీ లెప్రసీ కంటి వెలుగు తదితర పెండింగ్‌ బిల్లులు తక్షణమే చెల్లించి రూ.5 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పీఎఫ్‌ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, వారిపై ఉన్న పని భారాన్ని తగ్గించి జాబ్‌ చార్ట్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతకు ముందు లయన్స్‌ క్లబ్‌ ఆమనగల్‌ ఉపాధ్యక్షులు పాపిశెట్టి రాము ఆశా వర్కర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించి పనికి తగ్గ వేతనం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు లాలు నాయక్‌, ఆశా వర్కర్లు సల్మా, బేబి, అలివేలు, సంధ్య, చంద్రకళ, అనిత, మంజుల, సంతోష, వరలక్ష్మి, గౌరీ, పద్మ, సమంత, భాగ్యమ్మ, లలిత, సౌమ్య, ఈశ్వరమ్మ, కుమారి, దర్జీ, జ్యోతి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.