జర్నలిస్టుల జీవితాలు ఆందోళనకరం

జర్నలిస్టుల జీవితాలు ఆందోళనకరం– తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి
– యువ ఫొటో జర్నలిస్టు నర్రె రాజేష్‌ సంస్మరణ సభ
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
వృత్తిలో సవాళ్లు, విపరీతమైన పని ఒత్తిడి, సమయ పరిమితులు, తక్కువ వేతనాలతో జర్నలిస్టుల జీవితాలు ఆందోళనకరంగా మారుతున్నాయని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యువ ఫొటో జర్నలిస్టు నర్రె రాజేష్‌ 41 ఏండ్ల వయస్సులో మన మధ్య నుంచి ఆకస్మికంగా అదృశ్యం కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన నర్రె రాజేష్‌ సంస్మరణ సభను శుక్రవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్‌ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సభలో కె.శ్రీనివాస్‌ రెడ్డితో పాటు రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.విరహత్‌ అలీ, హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ ప్రధాన కార్యదర్శి శిగా శంకర్‌ గౌడ్‌, నర్రె రాజేష్‌ సతీమణి లావణ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్రె రాజేష్‌ కుటుంబానికి లక్ష రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.
అనంతరం కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. పత్రికల్లో వార్తలకు సాక్ష్యంగా నిలిచేది ఫొటోలేనని, ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు తమ కెమెరాల్లో బంధించడానికి ఫొటో, వీడియో జర్నలిస్టులు పడే తిప్పలు వర్ణనాతీతమన్నారు. వారు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటూ వారి చుట్టూ ఉన్న కఠినమైన వాస్తవ చిత్రాలు ప్రపంచం ముందుంచేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. హింసాత్మక సంఘటనలు చిత్రించే సమయంలో మరణించడం, గాయాలవడంతో పాటు వృత్తి ఒత్తిడితో ఫొటో జర్నలిస్టుల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని అన్నారు. నర్రె రాజేష్‌ ఎంతో బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారని కొనియాడారు.
మీడియాకు ఫొటో జర్నలిస్టులు కండ్లు, చెవుల లాంటి వారన్నారు. పాత్రికేయ వృత్తి అభద్రతా, అత్యంత ప్రమాదకరమైనటు వంటిదని ప్రజాస్వామిక దేశాలకు ఐక్యరాజ్య సమితి ఎప్పుడో సూచించిందని గుర్తు చేశారు. ఫొటో, వీడియో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతపై మీడియా సంస్థల యాజమాన్యాలు దృష్టి సారించాలని సూచించారు. నర్రె రాజేష్‌ భార్యకు పెన్షన్‌తో పాటు ఆయన పిల్లలకు విద్యనందించడానికి మీడియా అకాడమీ సహాయం అందజేస్తుందన్నారు. కె.విరాహత్‌ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో లాఠీలను, తూటాలను, కేసులను లెక్కచేయకుండా ఫొటో జర్నలిస్టులు పోషించిన సాహసవంతమైన పాత్ర అభినందనీయమన్నారు. ఫొటో, వీడియో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తమ సంఘం నాటి నుండి నేటి వరకు అహర్నిశలు కృషి చేస్తోంద న్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే రాజేష్‌ ఆకస్మిక మృతి తమను ఎంతో కలచివేసిందని, అతని కుటుంబానికి చేయూతనిస్తామని పేర్కొన్నారు. హెచ్‌యూజే అధ్యక్షులు శిగా శంకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ .. నర్రె రాజేష్‌ మృతితో తమ సంఘం క్రియాశీలక సభ్యుడిని కోల్పోయిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.హరి, జేఎన్‌జేహెచ్‌ఎస్‌ అధ్యక్షులు బొమ్మగాని కిరణ్‌ కుమార్‌, అనిల్‌, అధిక సంఖ్యలో ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు.