మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు: కలెక్టర్

The Lives of the Greats Give Us Lessons in Personality Development: Collectorనవతెలంగాణ – సిరిసిల్ల
మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం  సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయాక్, జిల్లా అధికారులు లతో కలిసి పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. 1897 సంవత్సరం జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జన్మించారని,  దేశ స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని, ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి పోరాడారని, ఆ సంస్థే నేడు ఇండియన్ నేషనల్ ఆర్మీ గా ఉందని అన్నారు. మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా వారి జీవితంలోని ముఖ్యంశాల నుంచి మనం వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేకం నేర్చుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయాక్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో రామ్ రెడ్డి, కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.