– ప్రపంచంలో ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు
– ఎడ్యుకేషన్ హబ్‌గా ఆశ్రమం
– నమూనాలు, డిజైన్లపై ప్రభుత్వ సంప్రదింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మూసీ తీరంలోని బాపూఘాట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం విధితమే. అక్కడ బ్రిడ్జి కమ్ బ్యారేజీతో పాటు గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గాంధీ బోధనలు, ఆచరణ, ఆశయాలు ప్రతిబింబించేలా దాన్ని నిర్మించాలని సంకల్పించారు. దీంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కోర్సులు నిర్వహించేందుకు వీలుగా ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విగ్రహాన్ని ఏ ఆకృతిలో తయారు చేయాలి? ఎంత ఎత్తుతో తయారు చేయించాలి? డిజైన్లు ఎలా ఉండాలి? తదితర అంశాలపై ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశ విదేశాల్లో ఉన్న గాంధీ విగ్రహాలు, ఆశ్రమాల సమాచారం సేకరించి వెంటనే అధ్యయనం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల విగ్రహమే ఇప్పటి వరకు దేశంలో అత్యంత ఎత్తయింది. 2013లో దీన్ని కాంస్యంతో ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎదుట ఉన్న గాంధీó విగ్రహమే ఇప్పటివరకు తెలంగాణలో పెద్దదిగా గుర్తింపు పొందింది. 2018లో గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం ప్రపంచంలో అత్యంత ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అత్యంత ఎత్తైన మహాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. విగ్రహం ఏర్పాటులో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలనీ, అవసరమైతే మేధావులు, పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలను స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారు. ప్రపంచంలో అందరి మదిలో నిలిచేలా బాపూఘాట్‌లో గాంధీ విగ్రహాం ఉండాలనే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తోంది.. ఈ నేపథ్యంలో అధికారులు విగ్రహం ఏర్పాటుకు సంబంధించి చర్యలు చేపట్టారని సమాచారం.