బీజేపీని గద్దెదించడమే ప్రధాన లక్ష్యం

The main objective is to oust the BJP– అక్టోబర్‌ 5న ‘చలో ఢిల్లీ’ విజయవంతం చేయాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-భూపాలపల్లి
‘బీజేపీని గద్దె దించండి – మహిళలను, దేశాన్నీ రక్షించండి’ నినా దంతో అక్టోబరు 5వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో అతిపెద్ద మహిళా సంఘంగా ఉన్న ఐద్వా మహిళల సమాన హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు దాటినా మహిళలపై హింస, లైంగిక దాడులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా హక్కుల పరిరక్షణకు ఐద్వా పోరాడుతోందని తెలిపారు. కోటి సభ్యత్వంతో 26 రాష్ట్రాలకు విస్తరించిన ఐద్వా.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోకి చొచ్చుకుపోయి పని చేస్తోందన్నారు. 1981లో ఆవిర్భవించినప్పటి నుంచి స్త్రీల ఆహార, ఉపాధి, విద్య, వైద్య హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. 2014లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టాక మహిళల స్వేచ్ఛా స్వతంత్రాలపై, బతుకు దెెరువుపై మునుపెన్నడూ లేని రీతిలో దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు సైతం కేంద్రం తెగబడుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను తిప్పికొట్టే దిశగా రానున్న 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా ఐద్వా పని చేస్తోందని స్పష్టంచేశారు. తెలంగాణలో మూడు లక్షల సభ్యత్వం కలిగిన ఐద్వా నిరంతరం స్త్రీల సమస్యలపై ఉద్యమిస్తోందన్నారు. అక్టోబరు 5న జరపబోయే ప్రదర్శనను జయప్రదం చేసేందుకు జిల్లాల్లో సెమినార్లు, పది రోజులపాటు జీపు జాతాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నలిగంటి రత్నమాల, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి సంగం ప్రీతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ సొప్పదండి స్వర్ణలత, జిల్లా ఉపాధ్యక్షులు ముక్కెర శ్రీలత, జిల్లా కమిటీ సభ్యులు దాట్ల రజిత, ఉషారాణి, మంద కోమల, బందు సుజాత, మండల ఉపాధ్యక్షులు పులి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.