“One owes respect to the living
To the dead one owes nothing, but the truth “
– Voltaire
(బతికున్న వారి గురించి గౌరవంగా మాట్లాడు. కాని గతించిన వారి గురించి కేవలం నిజాలే చెప్పు) 18వ శతాబ్దపు ఫ్రెంచ్ పునరుజ్జీవనోద్యమ మహాకవి వోల్టెయిర్ అన్న మాటల సందర్భం వేరు కావచ్చు!. నేడు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా, మరీ ముఖ్యంగా మతోన్మాదం వెర్రితలలు వేస్తున్న ఉత్తర భారత దేశానికి చెందిన సోనూ కుమార్ చిందించిన రక్తం నేర్పిన నిజమేమంటే మనుషుల కోసం మనుషులు స్పందిస్తారు. బాధ పడతారు. అవసరమైతే రక్త తర్పణం చేస్తారు. పటాన్‌చెరు పక్కనే జాతీయ రహదారిపై ఉన్న ముత్తంగి గ్రామం. ఆకలి ఒక చోటికి చేర్చిన వలస కూలీలు సోనూ కుమార్, అబేద్ అలీలు. ఎవరికి ఎవరూ ఏమీ కాని రెండు కుటుంబాలు. ఒకరిది బీహార్. మరొకరిది అస్సాం. పక్క పక్క ఇళ్లవారు కాదు కదా, పక్క రాష్ట్రాల వారు కూడా కాదు. ఏ బంధమూ లేని ఆ ఇద్దరినీ కలిపిన స్వేద బంధమే పేగు బంధాన్ని మించి పెనవేసుకుంది. మొన్న ఆదివారం ఆకలేసి అబేద్ అలీ నాలుగేళ్ల కొడుకు ఏడ్చి ఉండకపోతే, ఆ పిలగాడి ఏడుపు ఆ గుడిసె లోనుండి ఈ గుడిసెలోకి వినపడకపోయుంటే, దానికి సోనూ కుమార్ గుండె చలించకపోయుంటే నేడు విగత జీవులైన ఆ ఇద్దరూ సజీవులుగా ఉండి ఉండేవారు. బిస్కెట్ ప్యాకెట్ కోసం ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని నల్లతాచు లాంటి ఆ రోడ్డును దాటి బిస్కెట్ పాకెట్‌తో విజయుడై తిరిగి వస్తూండగా దూసుకొచ్చిన నాలుగు చక్రాలకు బలైనా రివురూ! ఆ రోడ్డుకు అది అలవాటే. చతుష్పాద జంతువు లెన్ని చావట్లే!? ఏ రాష్ట్ర ఓటర్ల లిస్టులో లేని కార్మికులకూ ఆ చావులు అలవాటే! నిజమే! పాతికేండ్ల సోనూ కుమార్, నాలుగేండ్ల రంజాన్ అలీ కలిపి నాలుగు కాళ్లే సుమా! పోలీసు దర్యాప్తు సా… గుతుందో, గుర్తు తెలి యని వాహనం ఢ కొందని ఆగుతుందో తెలియదు! ఏడ్చే కండ్లే లేకపోతే దర్యాప్తు ‘పాపం’! ముందుకేమి పోతుంది?!
పరివార మూకకు ఇదొక అనుభవాన్ని నేర్పితే, మతో న్మాదంపై అహరహం పోరాడే శక్తులకు మరొక విలువైన పాఠాన్నందిస్తుంది. ‘తురకోడి’ బిడ్డ కోసం ఒక హిందూ ‘ఆత్మ’ విలవిల్లాడట మేంటని మతోన్మాదుల ఆలోచన! ‘మిథిలా’ నగరం బీహార్, ఝార్ఖండ్‌ల నడుమనుంటుందని గూగుల్ తల్లి చెబుతోంది. ఆ మిథిల లోనే సాక్షాత్తు జనక మహారాజు (ఆ రోజు కూలీలెవరూ పన్లోకి వచ్చుండక పోవచ్చు!) పొలం దున్నుతూంటే ఒక పెట్టె దొరికింది. దాన్లో బిడ్డ సీతమ్మ దొరికిందని పురా ణాల్లో ఉంది. అందుకే అక్కడ సీతాజన్మస్థాన ఆందోళనకు గోచీలెగ్గడ్తున్నారు. బీహార్, జార్ఖండ్‌లు ప్రస్తుతానికి బీజేపీకి కొరకరాని కొయ్యలుగా ఉన్నాయి. పన్లో పనిగా వాటి ‘పనీ’ పూర్తి చేయొచ్చు. పార్లమెంటు ఎన్నికల నాటికేమవుతుందో చూద్దాం. సోనూకుమార్ లాంటి ‘ఆత్మ’లకు విరుగుడుకు ప్రయత్నాల్లో ‘పరివార’ముంటుంది.
హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడే వారికి ఈ ఘటనిచ్చే ఆలంబనే మంటే అది ఉత్తరమా, దక్షిణమా, తూర్పా, పడమరా అన్న తేడా లేకుండా హిందూ ముస్లిం చీలిక ఇంకా సమాజం లో కిందిస్థాయికి దిగలేదు. ముఖ్యంగా ఫ్యాక్టరీ ఉత్పత్తి విధానం కార్మికుల్లో తెచ్చిన ఐక్యత సజీవంగా ఉంది. మొన్నటి రైతు ఉద్యమం సహరాన్‌పూర్‌లో ముస్లిం, సిక్కు రైతుల్ని ఐక్యం చేసిన తీరు, ముజఫర్‌పూర్‌లో దళిత రైతులు, ముస్లిం రైతులు చెట్టాపట్టాలేసుకుని నడిచిన తీరు చూశాం. వర్గపోరాటం ప్రజల మధ్య తెచ్చే ఐక్య ప్రాధాన్యతను అర్థం చేసుకుంటే మతోన్మాదంపై పోరాడే శక్తులకు వెయ్యేనుగుల బలం వస్తుంది.
నేడు ఒక పక్క బుల్డోజర్ రాజ్యంలో దాడులు దౌర్జన్యాలు ముస్లిములపై సాగు తున్నా… మొన్న ప్రపంచ కప్‌లో భారత దేశాన్ని విజయం అంచుకి తీసికెళ్లిన మొహ్మద్ షమి ఉత్తరప్రదేశ్ వాడే. గతంలో ప్రత్యర్థి టీమ్‌ల వెన్నులో చలి పుట్టించిన ఇర్ఫాన్ పఠాన్ ముస్లింల ఊచకోత సాగిన గుజరాత్ వాడు. దేశ స్వాతంత్య్రం కోసం మొదలుపెట్టి ఆటల్లో దేశాన్ని విజయ పథంలో నడిపేందుకు ప్రయత్నించే వారి వరకు దేశంలో జరిగే రాజకీయ పరిణామాలతో ప్రభావితం కాని వారే వీరందరూ!
ఈ కుండ పాలలో ఉప్పు కల్లు వేసేం దుకు పొంచి ఉన్న శక్తులను గమనించాలి.
అందుకే, గుండెలకే కండ్లుంటే వాటి నిండా బిందెలకొద్దీ నీళ్లుంటే ముత్తంగి లాంటి ఘటనలకు బడబాగ్నులు బద్దలై సునామీలు విరుచుకుపడవా!