అతనొక కమ్యూనిస్టు నేత, అభ్యుదయ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ పోరుపతాక. ‘ప్రజలమనిషి’ నవల ద్వారా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన నాయకుడు. ఆయనే …వట్టికోట అళ్వారుస్వామి. గ్రంథాలయ ఉద్యమకారుడిగా, ప్రచురణకర్తగా తన జీవితంలో విశిష్టమైన పాత్ర పోషించారు ”ఒక సందర్భంలో అసలు ఆళ్వార్లు పన్నెండు మందే, పదమూడో ఆళ్వారు మా వట్టికోట ఆళ్వారుస్వామి” అని మహాకవి దాశరథి కీర్తించిన ప్రజారచయిత, నిస్వార్థ సేవా పరాయణుడు వట్టికోట. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం (నకిరేకల్ సమీపంలోని) మాధవరం గ్రామంలో 1915 నవంబర్1న నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో ఆళ్వారుస్వామి జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా పరాయిండ్లలో వంటలు చేసిపెట్టి, పనులు చేస్తూ బతికాడు. అందువల్ల ప్రాథమిక దశలోనూ విద్యాభ్యాసానికి నోచుకోలేదు. పద్నాలుగేండ్ల వయసులో సూర్యాపేటలో గ్రంథాలయం ద్వారా ఆయనకు పరిచయం మొదలైంది. ఈ గ్రంథాలయంలోనే అనేక పుస్తకాలు చదువుకున్నాడు. సొంతంగా తెలుగు మాత్రమేగాక ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే నకిరేకల్, సూర్యాపేట ప్రాంతాల్లోని ఇండ్లలో వంటపనులు, విజయవాడలోని హోటల్ సర్వర్ వృత్తి వంటి అనేక జీవన ప్రయాణాలు చేశాడు. చివరికి 1936-37 ప్రాంతంలో హైదరాబాద్ చేరి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ ఉద్యోగంలో చేరాడు. అప్పటినుండి 1961 ఫిబ్రవరిలో మరణించేవరకూ ఆయన జీవితమంతా సాహిత్య, సామాజిక కార్యక్రమాలకే అంకితం చేశాడు. స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ, తెలంగాణ రచయితల సంఘాల వంటి సామాజిక, రాజకీయ, సాహిత్య సంస్థలన్నింటిలో చురుకయిన కార్యకర్తగా, నాయకుడిగా పేరుపొందాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి కార్మికోద్యమాలకు నాయకత్వం వహించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి దూరమైనా, 1959లో కేరళలో తొలిసారిగా ఏర్పడిన కమ్యూనిస్టు నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయగా, నిరసనగా మళ్లీ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఆళ్వారుస్వామి, 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి ముందటి తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటంతో ‘ప్రజల మనిషి’ నవల రూపొందించారు. ఆయన మొదట్లో రచించిన కథల కన్నా ‘జైలు లోపల’ కథలు భాష, శైలి, కథనం, కథన శిల్పంలో ముఖ్యమైనవి. ఆయన కథా రచనలో చేసిన సాధన, కథన శిల్పంలోని ప్రస్థానం తెలుగు సాహిత్యంలో కొన్ని ఉత్తమమైన, అపురూపమైన కథలను సృష్టించాయి. తెలుగు సాహిత్యానికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ మాండలికంలో, సహజ సుందరమైన శైలిలో వాస్తవిక జీవితాలకు కథనరూపమిచ్చిన సజీవ శిల్పాలుగా వట్టికోట ఆళ్వారుస్వామి కథలు నిలిచిపోతాయి. ప్రజల్లో చైతన్యం, ప్రశ్నించేతత్వం, సమాజం పట్ల కచ్చితమైన అవగాహన ఉండాలంటే పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని చాటిచెప్పిన అళ్వారు గ్రామగ్రామాల్లో ప్రచారం నిర్వహించాడు. పుస్తకాలతోనే గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపాడు. కథకునిగా, నవలాకారునిగా, ప్రజాఉద్యమ నాయకునిగా ఆళ్వారుస్వామి జీవితకాలమంతా చేసిన కృషి ఈనాటి రచయితలకీ, కవులకీ ఆదర్శప్రాయం. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ఆరేండ్లపాటు జైలు జీవితం అనుభవించిన రచయిత ఆళ్వారుస్వామి. జైలునుంచి విడుదలైన తర్వాత కూడా ప్రజల్ని చైతన్య పరిచే విధంగానే ముందుకు నడిచిన నాయకుడు. ఈనాటి సాహిత్యకారులకు ఆళ్వారుస్వామి జీవితం ఆదర్శం. జీవితచరమాంకం వరకు ప్రజలకోసం నిస్వార్థంగా పనిచేసిన ఆళ్వారుస్వామి1961 ఫిబ్రవరి 5న మరణించారు. ప్రతి కవి, రచయిత ఆళ్వారు స్వామిని స్పూర్తిగా తీసుకుని మూఢనమ్మకాల్లో కొట్టుకుపోతున్న నేటి సమాజాన్ని శాస్త్రీయ దృక్పథం వైపు పయనించే విధంగా పాటుపడాలి. ప్రతి జిల్లాలో ఆయన పేరు మీద కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించేలా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. ఆయన వర్థంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.
(నేడు వట్టికోట అళ్వారుస్వామి వర్ధంతి)
– కామిడి సతీష్ రెడ్డి, 9848445134