మార్కెట్ కమిటీ ఏకపక్షమే 

the-market-committee-is-unilateral– ప్రాంతాలవారీగా ప్రాతినిధ్యం శూన్యం
– కొరవడిన సామాజిక కూర్పు 
– ఇబ్రహీంపట్నం మండలానికే అత్యధిక ప్రాధాన్యం
– మెజార్టీ ఇచ్చిన యాచారానికి మొండి చేయి సీనియర్లను గుర్తించని అధిష్టానం 
– కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను పక్కకు పెట్టిన వైనం 
– యాచారం, మంచాల మండలాలకు కేవలం రెండే డైరెక్టర్లు 
– ఇబ్రహీంపట్నం మండలానికి చైర్మన్, వైస్ చైర్మన్ సహా 10 స్థానాలు
– కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కాంగ్రెస్ లోని గ్రూప్ తగాదాలు..
– ఆదిభట్ల మున్సిపాలిటీకి గుండు సున్న
– నేడు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న మంత్రులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రకటించిన నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ తీర్పు పై కన్నెర్ర చేస్తున్నాయి. మార్కెట్ కమిటీ ఏకపక్షమేనంటున్నాయి. ప్రాంతాలవారీగా ప్రాతినిధ్యం శూన్యమంటున్నాయి.
ఇబ్రహీంపట్నం మండలానికే అత్యధిక ప్రాధాన్యం
మెజార్టీ ఇచ్చిన యాచారానికి మొండి చేయి దక్కిందంటున్నాయి. సీనియర్లను అధిష్టానం గుర్తించలేదంటున్నాయి. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను పక్కకు పెట్టిన వైనాన్ని ఎత్తి చూపుతున్నాయి. యాచారం, మంచాల మండలాలకు కేవలం రెండే డైరెక్టర్లు ఇచ్చి, ఇబ్రహీంపట్నం మండలానికి చైర్మన్, వైస్ చైర్మన్ సహా 10 స్థానాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఆదిభట్ల మున్సిపాలిటీకి గుండు సున్న చూపారని  బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దాంతో  కాంగ్రెస్ లోని గ్రూప్ తగాదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇతరుణంలో ఇబ్రహీంపట్నం ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు మంత్రులు హాజరు కానున్నారు.
సీనియర్లకు దక్కని అవకాశం..
ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో సీనియర్లకు అవకాశం దక్కకుండా పోయింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత 43 సంవత్సరాలుగా ఎలాంటి ప్రాతినిధ్యం లేకున్నా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న సీనియర్లు కనీసం నామినేటెడ్ పదవుల్లోనైనా అవకాశం దక్కుతుందని ఆశతో ఎదురు చూశారు. గత 43 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని క్షేత్రస్థాయిలో పార్టీ జవసత్వాలు దెబ్బతినకుండా కాపాడుతూ వచ్చారు. గ్రామస్థాయిలో సర్పంచి, ఎంపీటీసీ స్థానాలను తమ భుజాలపై వేసుకొని గెలుపు వాకిట నిలుపుకున్నారు. ఇందులో క్షేత్రస్థాయి ఎన్నిక జరిగిన అధిష్టాన సహకారం లేకపోయినా పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఆ సీనియర్ నాయకుల పోరాటపటిమనే గత శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీని కట్టబెట్టింది. కానీ అధికారం చేపట్టిన తర్వాత వారందరికీ తమ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశ పడ్డారు. కానీ చివరికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధిష్టానం సీనియర్లకు మొండి చేసి చూపింది. నామినేటెడ్ పోస్టులు దక్కకుండా చేసింది. సీనియర్, జునియర్ అనే కూర్పు పాటించకుండా కేవలం తమకు నచ్చిన వారికి మాత్రమే పదవులు ఇస్తూ సీనియర్లను పక్కకు నెట్టేసింది. దాంతో సీనియర్లు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. అవసరమైతే తిరుగుబాటు జెండా ఎత్తడానికి కూడా చాప కింద నీరుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన అధిష్టానానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రుచి చూపిస్తాం అంటున్నారు.
మెజార్టీ ఇచ్చిన ఉపయోగం లేదా?
గత శాసనసభ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి యాచారం మండలం భారీ మెజార్టీని కట్టబెట్టింది. ఈ ప్రాంతంలో ఫార్మసిటీకి వ్యతిరేకంగా గత అధికార పార్టీకి ఉద్యమాలను ఉదృతంగానే నడిపారు. క్షేత్రస్థాయిలో పార్టీకి జవ సూత్రాలు నింపారు. ఈ తరుణంలోనే శాసనసభ ఎన్నికల్లో మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లా పూర్ మెట్ మండలాలతో పోలిస్తే యాచారం మండలం భారీ మెజార్టీని కట్టబెట్టింది. కానీ నామినేటెడ్ పదవుల్లో మాత్రం కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మస్కు నరసింహ, మైనార్టీ సామాజిక వర్గం నుంచి అక్బర్ కు అవకాశం ఇచ్చారు. దాంతో సీనియర్లు అందరూ గుర్రుగా ఉన్నారు. ఇక్కడ మరో కనీసం రెండు స్థానాలైనా ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే మండలానికి చైర్మన్, వైస్ చైర్మన్, 10 డైరెక్టర్లు…
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో మెజార్టీని కట్టబెట్టని ఇబ్రహీంపట్నం మండలానికి మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు ఇవ్వడమే కాకుండా 10 డైరెక్టర్ స్థానాలు ఇవ్వటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం నుంచి చైర్మన్గా గురునాథరెడ్డి, వైస్ చైర్మన్ గా కరుణాకర్ ను నియమించిన అధిష్టానం డైరెక్టర్లుగా రాఘవేందర్ రెడ్డి, శ్రీశైలం కరుణాకర్ రెడ్డి, బి రాజు, మహేష్ గౌడ్, లింగస్వామి, శివకుమార్, మల్లికను డైరెక్టర్ గా నియమించారు. అంతే కాకుండా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్, ఉప్పరిగూడ సొసైటీ చైర్మన్ కు డైరెక్టర్లుగా అవకాశం కల్పించారు. మంచాల మండలం నుంచి సైతం కేవలం ఇద్దరికీ మాత్రమే అవకాశం కల్పించారు. ఒకరు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎల్లేశ్ ను తీసుకోగా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి కె పాండుకు అవకాశాల కల్పించారు.
ఆదిభట్లకు గుండు సున్నా…
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోనే పేరుగాంచిన మున్సిపాలిటీగా ఆదిభట్ల నిలుస్తుంది. ఇక్కడ చైర్మన్గా అధికార పార్టీకి చెందిన మర్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం అత్యధిక కౌన్సిలర్లున్నారు. ఇక్కడ మర్రి నిరంజన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి పోసగడం లేదు. రెండు వేరువేరు గ్రూపులుగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో మర్రి నిరంజన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆదిభట్ల మున్సిపాలిటీలో ఒక డైరెక్టర్ స్థానానికి కూడా అవకాశాలు కల్పించకపోవడంపై సైతం మండిపడుతున్నారు. వ్యక్తుల పైన ఉన్న గ్రూపులు పార్టీకి రుద్దడం ఏమిటని నిలదీస్తున్నారు.