ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం

– ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ 
– ప్రజలు సుభిక్షంగా ఉండాలి 
– రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ  – నల్గొండ కలెక్టరేట్ 

రాష్ట్ర ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండేలా నల్లగొండ జిల్లా ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వదించాలని, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవానికి ఆయన  సతీమణి  సబిత తో  కలిసి జమదగ్ని సమేత రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణా నికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున  పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతే కాక ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి దంపతు లకు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. కనగల్ మండలం దరవేశి పురం రేణుక ఎల్లమ్మ అమ్మవారి వార్షిక  బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కళ్యాణం నిర్వహించగా మంత్రి దంపతులు హాజరై కల్యాణం జరిపించారు. కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులందరికీ మంత్రి ఉచిత అన్నదానం జరిపించారు. ఈ  సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా ప్రజలు,రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి ప్రజలు పాడి, పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించి నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో  తెలంగాణ రాష్ట్రంలోనే  ముందు స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ  కళ్యాణ మహోత్సవానికి ఈవో జల్లపల్లి జయరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ నగేష్, ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమార్ చారి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు.