మున్సిపల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మేయర్

నవతెలంగాణ –  కంటేశ్వర్
నగరంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో మేయర్ దండు నీతూ కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిధిగా  ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్, నగర మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ లు కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మేయర్ గారు 2024-25సంవత్సరానికి సుమారు రూ.274 కోట్ల అంచ బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో మున్సిపల్ ఆదాయం సుమారు రూ.90కోట్లు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సుమారు  రూ.177 కోట్ల నిధులు గ్రాంట్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని అన్నారు. మున్సిపల్ ఆదాయం నుండి మౌలిక సదుపాయాల నిర్వహణ చేయటం జరుగుతుందని అన్నారు. సమావేశానికి ముందు కార్పొరేటర్లు సమస్యలపై చర్చించాలని కోరగా మేయర్ అనుమతించి సభ్యుల ప్రశ్నలకు అధికారులతో వివరణ ఇవ్వటం జరిగింది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లను నగర మేయర్ పుష్పగుచ్చని అందించి స్వాగతం పలికారు. నగర అభివృద్ధికి నిధుల సమీకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో నిజామాబాద్ 60 డివిజనల్ పరిధిలోని కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే సమావేశం ముందు మీడియాను అనుమతించకపోవడంతో కార్పొరేటర్లు ఎట్టి పరిస్థితులలో మీడియాను తప్పనిసరిగా అనుభవించాలని పట్టుపట్టారు. అయినప్పటికీ మీడియాను అనుమతించకపోవడంతో పోలీసులను లోపలికి పిలిపించి లోపల ఉన్న మీడియాను బయటకు పంపించారు. దీంతో మీడియా ప్రతినిధులతో పాటు మీడియా సంఘాలు అలాగే కార్పొరేటర్లు సైతం తీవ్రంగా ఖండించారు.