ఎంసీహెచ్ కిట్ ఆగింది!

The MCH kit has stopped!– గతేడాది అక్టోబర్ నుంచి నిలిచిన సరఫరా
– 2022 ఆగస్టు నుంచి అందని ప్రోత్సాహకం
– న్యూట్రిషన్ కిట్లది ఆడేదారి
– గర్భిణులు, బాలింతలకు తప్పని ఎదురుచూపులు
నవతెలంగాణ – మల్హర్ రావు 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఎంసీహెచ్ కిట్ పంపిణీ నిలిచిపోయింది. దీంతోపాటు గర్భిణులు,బాలింతలకు ప్రోత్సాహాకాలు కూడా బంద్ అయ్యాయి. గర్భిణులకు అందజేసే న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కూడా ఆగింది. దీంతో గర్భిణులు, బాలిం తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి గురించి వైద్యులు, అధికారులను అడిగితే సమాధానం దాటవేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కిట్లను సర ఫరా చేస్తుందో, ప్రోత్సాహక నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందోనని గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు.
కిట్లో 20 రకాల వస్తువులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసింది.కిట్లో 20 రకాల వస్తువులను తల్లికి బిడ్డకు అవసరమైన వాటిని ఉంచి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలోనే అందజేసింది.ప్రభుత్వ వాహనంలో వారిని ఇళ్ల వద్దకు చేరవే సేవారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పేరును ఎంసీహెచ్ కిట్టుగా మార్చింది. పేరు మార్చిన తర్వాత అప్పటికే ఉన్న కేసీఆర్ కిట్లపై ఎంసీహెచ్ కిట్లుగా రాసి స్టిక్కర్లను అతికించి బాలింతలకు అంజేశారు. కిట్లు సరఫరా కాకపోవడంతో గతేడాది అక్టోబర్ నుంచి పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1200 మంది బాలింతలకు ఎంసీహెచ్ కిట్లు అందజేయాల్సి ఉంది. ఆస్పత్రుల్లో కిట్ల గురించి అడిగే బాలింతలకు సమాధానం చెప్పలేక వైద్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
రెండేళ్లుగా నిలిచిన ప్రోత్సాహకం..
గర్భం దాల్చిన మహిళ మూడు నెలల నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేరు నమోదు చేసుకుని నెల నెలా పరీక్షలు నిర్వహించుకోవడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహాకాన్ని అమలు చేసింది. ఆడపిల్ల పుడితే రూ.13 వేల, మగబిడ్డ పుడితే రూ.12 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఈ మొత్తాన్ని గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు చెకప్ లు పూర్తయిన తర్వాత రూ.2 వేలు, ప్రసవించిన తర్వాత రూ.3 వేలు, బిడ్డకు వ్యాక్సినేషన్ తర్వాత రూ.2 వేలు, అన్ని వ్యాక్సినేషన్లు పూర్తయిన తర్వాత మిగతా డబ్బులను తల్లుల ఖాతాల్లో వేసేవారు. ప్రస్తుతం ఈ ప్రోత్సాహాకం కూడా పూర్తిగా నిలిసిపోయింది.2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా రూ. 14 లక్షల ప్రోత్సాహక బకాయిలు తల్లుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.ఈ డబ్బుల కోసం 1200 మంది తల్లులు ఎదురుచుస్తున్నారు.
అందని పౌష్టికాహారం…
గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా రక్తహీనత నుంచి రక్షించి మాతా శిశు మరణాలను తగ్గించేలా గత ప్రభుత్వం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసింది. న్యూట్రిషన్ కిట్లో నెయ్యి, హార్లిక్స్, ఖర్జూరాలు, పల్లీ పట్టీ, తదితర వస్తువులను బుట్టలో పెట్టి అందజేసేవారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జీజీహెచ్ పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ కిట్ల పంపిణీ కూడా నిలిచిపోయి ఏడాది అవుతోంది.
ప్రభుత్వం నుంచి సరఫరా లేదు….వైద్యాధికారి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంసీహెచ్ కిట్లు, న్యూట్రి షన్ కిట్లు సరఫరా కావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే అందజేస్తాం. ప్రోత్సాహాకాల నిధులు కూడా ప్రభు త్వం నుంచి విడుదల కాలేదు. విడుదల య్యాక వెంటనే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం.