నవతెలంగాణ-మల్హర్‌రావు
మేడారం జాతర ముగిసింది.. ఇక ఇసుక జాతర మొదలుకానుంది. భూపాలపల్లి జిల్లాలోని మల్హర్‌రావు మండలంలోని మానేరు, గోదావరి నుంచి ఇసుక తరలింపు తిరిగి ప్రారంభం కానుంది. మేడారం జాతర నేపథ్యంలో ఇసుక లారీలను జాతర ముగిసే వరకు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో జాతర దృష్ట్యా పది రోజులపాటు మంథని నియోజకవర్గ పరిధిలో ఇసుక లోడింగ్ బంద్ అంటూ టీఎస్‌ఎండీసీ ప్రకటన చేసింది. జాతర ముగియడంతో మళ్లీ గోదావరి నది నుంచి ఇసుక లారీలు, ట్రాక్టర్లు రోడ్డెక్కనున్నాయి.
ఇసుక రవాణా బంద్ కావడంతో మంథని నియోజకవర్గ రోడ్లపై పది రోజులపాటు ప్రశాంతంగా ఉంది. నేటి నుంచి మళ్లీ మంథని రోడ్లన్నీ గజిబిజిగా, ఇసుక లారీల రణగొన ధ్వనులు, ఓవర్ లోడ్‌ల విన్యాసాలు కనిపిస్తాయి.