దామెరవాయి గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి, వైద్య బృందం 

District Medical Officer and medical team visited Dameravai villageనవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల దామెరవాయి గ్రామంలో గత మూడు నాలుగు రోజుల నుండి ఒళ్ళు నొప్పులతో కూడిన తీవ్ర జ్వరాలు గ్రామం మొత్తం వ్యాపించాయి. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రంజిత్ వైద్య శిబిరం నిర్వహించి ప్రతిరోజు సందర్శించి పరిశీలిస్తున్నప్పటికీ జ్వరాలు తగ్గడం లేదు. ఆదివారం జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. వైద్యాధికారి రంజిత్, వైద్య సిబ్బంది తో కలిసి దామెరవాయి గ్రామాన్ని సందర్శించి, ఇంటింటా సర్వే నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న 15 జ్వర పీడితుల రక్త నమూనాలు సేకరించి ములుగు టీ హబ్ కు పంపించారు. వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అప్పయ్య మాట్లాడుతూ ఇండ్లలో నీరు నిల్వ ఉంచుకోకూడదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న నీటి నిల్వలు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే జ్వరాలు వస్తాయని, ఎంత చేసిన ఫలితం ఉండదు అన్నారు. గ్రామంలోని వారందరూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రంజిత్, హెచ్ ఈ ఓ సమ్మయ్య, హెల్త్ అసిస్టెంట్ మొగిలిపల్లి ముత్తయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.