కరుగుతున్న డాలర్‌

The melting dollar– ప్రపంచ రిజర్వ్‌ నిధులలో భారీక్షీణత -ఐఎంఎఫ్‌
ప్రపంచ కేంద్ర బ్యాంకులలోని రిజర్వ్‌ కరెన్సీలలో అమెరికన్‌ డాలర్‌ వాటా క్షీణించటం కొనసాగుతూవుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం 2023లోని మూడవ త్రైమాసికంలో డాలర్‌ వాటా 59.2శాతానికి పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా డాలర్‌ అవసరంలేని లావాదేవీలు జరుగుతున్న (డిడాలరైజేషన్‌) నేపథ్యంలో ఈ క్షీణత సంభవించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి అందించిన గణాంకాల ప్రకారం 2000సంవత్సరంలో ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీ నిధులలో డాలర్‌ వాటా దాదాపు 70శాతం ఉండేది. ఇప్పటికీ డాలర్‌ ప్రధాన రిజర్వ్‌ కరెన్సీగానే ఉంది. ఆ తరువాత స్థానంలో యూరో ఉంది. యూరో వాటా కూడా 19.6శాతానికి పడిపోయింది. జపనీస్‌ యెన్‌ వాటా అంతకు ముందటి త్రైమాసికంలో 5.3శాతంగా ఉండగా అది మూడవ త్రైమాసికంలో 5.5శాతానికి పెరిగింది. చైనీస్‌ యువాన్‌, బ్రిటీష్‌ పౌండ్‌, కెనడియన్‌ డాలర్‌, స్విస్‌ ఫ్రాంక్‌ ల వాటాలలో స్వల్ప మార్పు సంభవించింది. గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మెస్సేజింగ్‌ సర్వీస్‌ స్విప్ట్‌ సేకరించిన డేటా ప్రకారం నవంబర్‌ లో అంతర్జాతీయ చెల్లింపులలో ఎక్కువగా వాడిన కరెన్సీలలో చైనీస్‌ యువాన్‌ వాటా నాలుగవ స్థానానికి ఎగబాకింది. అలాగే వివిధ దేశాలకు యువాన్‌ లో అప్పులు ఇవ్వటం కూడా పెరిగింది. సౌదీ అరేబియా, అర్జంటీనాలతో కలిపి పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా విదేశీ కేంద్ర బ్యాంకులతో 30 ద్వైపాక్షిక కరెన్సీ ఒప్పందాలను చేసుకుంది. అంతర్జాతీయ చెల్లింపులలో యువాన్‌ వాటా పెరగటం చైనా డాలర్‌ నుంచి దూరం జరగటాన్ని, యువాన్‌ వినియోగాన్ని పెంచటం కోసం చైనా చేస్తున్న క్రుషిని సూచిస్తోందని స్విఫ్ట్‌ పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌ కు బదులుగా జాతీయ కరెన్సీలను ఉపయోగించటం గత సంవత్సరం బాగా ఊపు అందుకుంది. పశ్చిమ దేశాల ఫైనాన్షియల్‌ వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించటంవల్ల, రష్యాకున్న విదేశీ నిధులను ఘనీభవింపజేయటంవల్ల విదేశీ వాణిజ్య చెల్లింపులలో జాతీయ కరెన్సీ వినియోగం పెరిగింది. పశ్చిమ దేశాలు విధించిన ఆక్షలకు ప్రతిస్పందనగా రష్యా చైనీస్‌ యువాన్‌ లో చేస్తున్నవాణిజ్యంలో పెరుగుదల అమెరికన్‌ డాలర్‌ బలహీనపడటానికి దారితీస్తుందని యూరోపియన్‌ బ్యాంక్‌ ఫర్‌ రికన్స్ట్రక్షన్‌ అండ్‌ డెవెలప్మెంట్‌ (ఈబీఆర్డీ) హెచ్చరించింది. రష్యా అంతర్జాతీయ వాణిజ్యంపైన పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా చైనీస్‌ యువాన్‌ వాడకం పెరగటం డాలర్‌ నష్టపోవటానికి దారితీస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.