– రామగుండం పోలీస్ కమిషనర్ రెమారాజేశ్వరీ వెల్లడి
నవతెలంగాణ-గోదావరిఖని
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారంలో నిషేధిత సీపీఐ(మావోయిస్టు) టెక్నికల్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ టెక్నికల్ టీం క్యాడర్ సభ్యులు ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీపీ రెమారాజేశ్వరీ తెలిపారు.
రామగుండం కమిషనరేట్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డెల్టా గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన డి.గంగాధర రావు 1969లో వైజాగ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ చదివారు. 1972లో జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడే ఓ ప్రయివేటు కంపెనీలో చేరారు. 1980 వరకు అక్కడే పని చేసిన గంగాధరరావు మావోయిస్టు పార్టీ సిటీ కమిటీ ఆర్గనైజర్ విశ్వం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాక అందులో చేరారు. ఈయనకు డీవీసీఎం సీపీఐఎం డీకేఎస్‌ఐసీ-సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యురాలు భవానితో వివాహమైంది.
వీరికి ఒక కూతురు ఉంది. ఈ నేపథ్యంలో మావోయిసుటపార్టీ కేంద్ర కమిటీ గంగాధరరావుకు 2000లో సాంకేతిక విభాగం బాధ్యతలు అప్పగించగా ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీ చేసేవాడు.
పది నెలల కిందట కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఆదేశాల మేరకు ఆయన భార్య భవానితో కలిసి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం వచ్చారు. జాలంపెల్లి బక్కయ్య, జాలంపెల్లి లక్ష్మీ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తయారు చేసి, ఆ పేర్లతో ఇందారంలో స్థలం కొనుగోలు చేసి చిన్న ఇల్లు నిర్మించుకున్నారు.
ఇందారం నుంచే కార్యకలాపాలు
దంపతులిద్దరూ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సిరొంచకు వెళ్లి, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, బండి ప్రకాష్, బడే చొక్కారావు, ఏ.దామోదర్‌తో కలిసి పార్టీ సమావేశాలకు హాజరయ్యేవారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను వారితో వాట్సాప్‌లో చర్చించేవారు. తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాష్ట్రాల్లో రెండు మూడు సంవత్సరాలుగా మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించారు.
కొద్ది నెలల కిందట ఇందారం గ్రామానికి రాగా పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరికి సాయం చేసిన సీపీఐ మావోయిస్టు సానుభూతిపరుడైన కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేటకు చెందిన చిప్పకుర్తి శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనికి కోసం పోలీసుల ప్రత్యేక బృందం గాలిస్తోంది. పట్టుబడిన వీరిపై జైపూర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి నుంచి నకిలీ ఆధార్, పాన్‌కార్డులు, బ్యాంక్‌పుస్తకాలు, ఒక మొబైల్ ఫోన్, 6 మెమోరీ కార్డులు, ఒక ట్యాబ్, రెండు పెన్ డ్రైవ్‌లు, ఒక పాకెట్ డైరీ, ఒక పెన్, రెండో సెషన్ రిజల్యూషన్‌లు, తెలంగాణ రాష్ట్ర రెండో ప్లీనరీ తీర్మానాలు స్వాధీనం చేసుకున్నారు.