– పరిష్కారానికి ఐఏఎస్‌లతో కమిటీ
– మధ్యప్రదేశ్‌లో రోజుకు 55 కేసులు
– రేబిస్ ఇంజెక్షన్ కోసం ఆస్పత్రులకు బాధితుల క్యూ
భోపాల్: వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించింది. కుక్కల బెడద కేవలం వీధులు, నివాస ప్రాంతాల్లోనే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రదేశాల్లోనూ ఎక్కువగా ఉండడంతో సాధారణ పరిపాలనా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులతో పాటు మొత్తం 15 మంది సభ్యులు ఉన్నారు.ఈ రాష్ట్రంలో ఏడాదికి 21 వేల కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్ర ఆస్పత్రులు అందించిన సమాచారం ప్రకారం 2022లో 8,124 కేసులు నమోద య్యాయి. 2023 నాటికి ఆ సంఖ్య రెండు రెట్లు అధికంగా పెరిగి 16,387కి చేరింది. ఒక్క భోపాల్లోనే రోజుకు సగటున 55 కేసులు నమోదవుతున్నాయి. గత ఐదేండ్లలో వీధికుక్కల కాటుతో రేబిస్ వ్యాధి సోకి ఐదుగురు మరణించారు. జులైౖ 1న, భోపాల్‌లోని లాల్‌ఘటికి చెందిన కునాల్‌ను ఒక కుక్క దాడి చేయడంతో ఎనిమిది కుట్లు పడ్డాయి. ఐదు రోజుల తర్వాత రవి సాహు అనే బాలుడు తన కుటుంబంతో కలిసి రైసెన్‌లోని ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సమయంలో వీధికుక్కల దాడికి గురయ్యాడు. జులై 9న హౌషంగాబాద్‌లోని సేతాని ఘాట్‌లో ఓ వ్యక్తిపై వీధికుక్కలు దాడి చేయగా అతని కాలుపై లోతైన గాయాలయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా తయారైంది. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ షెల్టర్ హౌమ్‌లో వీధి కుక్కలు స్వైర్యవిహారం చేస్తున్నాయి. మరోపక్క రేబిస్ ఇంజెక్షన్ కోసం ప్రతీరోజూ అనేకమంది ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వరుస కుక్కకాటు ఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయని విపక్షం పేర్కొంది. అయితే జంతు సంరక్షణ సంస్థలు మాత్రం సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌లతో కమిటీ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఉన్నతాధికారులు మంచి నిర్ణయాలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరాయి. ఈ విషయంపై రాష్ట పశుసంవర్థక శాఖ మంత్రి లఖన్ పటేల్ మాట్లాడుతూ.. ”సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజల ప్రాణాలు రక్షించడం మా బాధ్యత. అందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశాం” అని అన్నారు.