ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కార్పొరేట్లకు, ధనవంతులకు అనుకూలంగా ఉందని, మధ్య తరగతిని పూర్తిగా విస్మరించిందని ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకులు కె.వి.ఎస్.ఎన్ రాజు అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నాయకులు ఈవియల్ .నారాయణ అధ్యక్షతన జరిగిన కేంద్ర బడ్జెట్- మధ్యతరగతి పై ప్రభావం సెమినార్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతూ దేశ ఆర్థికం లో 19% వాటా ఉందని, అదే పరిస్థితుల్లో కార్పొరేట్ల చెల్లించే పన్ను 17% వాటా ఉందని, ప్రభుత్వ విధానాల మూలంగా కోట్లు సంపాదించి,పన్ను చెల్లించగలిగిన వారికి రాయితీలు, బడుగు బలహీన వర్గాల వారికి, మధ్యతరగతి వారినుండి మాత్రం ముక్కు పిండి పన్నుల పేరా వసూలు చేస్తున్నారని, క్యాపిటల్ గెయిన్స్ పైన కూడా పన్ను పెంచారని, కోట్లు రుణాలుగా తీసుకొని బ్యాంకులను మోసం చేసి దర్జాగా తిరుగుతున్న వారి వద్దనుండి రూపాయి వసూలు చేయలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ఈ బడ్జెట్లో రైతులకు, కార్మికులకు మొండి చేయి చూపించిందని, మహిళోద్ధరణ గురించి మాట్లాడే వారు కోటి మంది పనిచేస్తున్న స్కీం వర్కర్ల గురించి ఊసే లేదని, 40 సంవత్సరాలపాటు ప్రజల కోసం , ప్రభుత్వంలో పనిచేసిన ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు ₹2000 రూపాయలు వస్తున్న వారి పెన్షన్ను మాత్రం రూపాయి కూడా పెంచలేదని, ఇలాంటివారు 60 లక్షల మంది పైగా ఉన్నారని, ఒక్క శాతం ఉన్న అంబానీ ఆదానీ లాంటి వారి ప్రయోజనాల కోసం ఈ బడ్జెట్ రూపొందించిందని అన్నారు. భారతదేశం నేడు ఒక కోటి 68 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని. ఈ డబ్బు ఎవరికోసం ఖర్చు పెట్టిందని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సెమినార్లో ఉద్యోగ జిల్లా నాయకులు శ్రీధర్, శిర్ప హనుమాన్లు, మధుసూదన్, హుస్సేన్, రామ్మోహన్రావు, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.