మంటల్లో మధ్య ప్రాచ్యం!

 Sampadakiyamమధ్య ప్రాచ్యంలో ఎప్పుడేమౌతుందో తెలియదు. ఇజ్రాయిల్‌, దానికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న ”అపర మానవాతా వాద” పశ్చిమ దేశాలు ఇంకా ఎన్ని ప్రాణాలు బలిగొంటాయో, ఎంత మంది పసిపిల్లల రక్తం తాగుతాయో చెప్పలేము. అక్టోబరు ఒకటవ తేదీన ఇరాన్‌ జరిపిన క్షిపణిదాడుల్లో భారీగా నష్టపోయినట్లు భావిస్తున్న ఇజ్రాయిల్‌ ప్రతీకార చర్యలకు పాల్పడతామని ప్రకటించింది. ఇరాన్‌ మిలిటరీ స్థావరాలతో పాటు దాని చమురు, అణుకేంద్రాలపై దాడులకు దిగుతా మన్నది. అయితే మూడు వారాలు కావస్తున్నా అదేమీ జరగలేదంటే దాని అర్ధం తోకముడిచి నట్లు కాదు. ఇరాన్‌, హిజ బుల్లా దాడుల తరువాత ఇప్పటి వరకు రక్షణగా ఉందని చెబుతున్న ఉక్కు పైకప్పు లేదా క్షిపణి నిరోధక వ్యవస్థలకు ఉన్న పరిమితులు అర్ధమయ్యాయి. దాంతో అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. అత్యా ధునిక థాడ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయిల్‌కు తరలిస్తామని వాటిని తమ సైనికులే నిర్వహిస్తారని ప్రకటించింది. అవి దారి మధ్యలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇవేకాదు ఇంకా అనేక ఆధునిక ఆయుధాలను మధ్యప్రాచ్యానికి తరలిస్తున్నారు. ఇప్పటికే మధ్యధరా సముద్రం, ఎర్రసముద్ర ప్రాంతంలోని తమ నౌకాదళాన్ని అమెరికా అప్రమత్తం గావించింది. భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చుకొనేందుకు, వ్యూహాలు పన్నేందుకు అవసరమైన వ్యవధి కోసమే ఇజ్రాయిల్‌ ప్రతిదాడులు ఆలస్యం అయినట్లు చెప్పవచ్చు.
ఇంతే కాదు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇరాన్‌ ఇంధన, అణుకేంద్రాల మీద దాడులు జరిపితే అది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీయవచ్చని జో బైడెన్‌ వద్దని వారించినట్లు, నెతన్యాహు సరే అన్నట్లు చెబుతున్నారు. ఇది కూడా నమ్మశక్యం కాదు.ఇరాన్‌ నాతంజ్‌ అణుకేంద్రంపై దాడికి బైడెన్‌ అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్‌ వెనక్కు తగ్గినట్లు వాషింగ్టన్‌ పోస్టు రాసింది. ఇదంతా చూస్తుంటే జనాన్ని గందరగోళపరిచేందుకు ఆడుతున్న ఒక నాటకంగా కనిపిస్తోంది. నవంబరు ఐదవ తేదీన జరిగే అమెరికా ఎన్నికల వరకు అలాంటిదాడులు చేయ వద్దని బైడెన్‌ కోరినట్లు కూడా చెబుతున్నారు. ఉద్రిక్తతలు, యుద్ధ సమయంలో వాస్తవాల కంటే కుట్ర సిద్ధాంతాలు, ప్రచారదాడి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపున గాజాలో మారణకాండ కొనసాగుతూనే ఉంది. లెబనాన్‌ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ దాడులు, ఆక్రమణ కొనసాగుతూనే ఉంది. వీటన్నింటినీ చూస్తే బలాబలాలను సమీక్షించుకొనేందుకు, మరిన్ని మారణాయుధాలను సమకూర్చుకొనేందుకు ఇజ్రాయిల్‌ పూనుకున్నట్లు కూడా చెప్పవచ్చు. అందుకే మధ్య ప్రాచ్యంలో ఎప్పుడేం జరిగేదీ ఎవరూ చెప్పలేని స్థితి.
ప్రస్తుతం ఇజ్రాయిల్‌ను వ్యతిరేకిస్తున్న ఎమెన్‌లోని హౌతీల దాడులు ఎర్ర సముద్ర ప్రాంతలో నౌకల రవాణా మీద తీవ్ర ప్రభావం చూపుతూ ఆఫ్రికా ఖండంలోని గుడ్‌ హోప్‌ ఆగ్రం గుండా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్‌ గనుక యుద్ధంలోకి దిగితే ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ అరేబియా, యుఏయి, ఓమన్‌లను తాకుతూ ఓమన్‌-ఇరాన్‌ మధ్య అరేబియా సముద్రంతో కలిసే పర్షియన్‌ గల్ఫ్‌ లేదా హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనమైతే, నౌకలు ముఖ్యంగా ప్రపంచంలో రోజూ జరిగే చమురు రవాణాలో 21శాతానికి తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నారు. రోజుకు రెండు కోట్ల పదిలక్షల పీపాల ముడిచమురు ఆసియా ఖండ దేశాలకు సరఫరా అవుతున్నది. ఒక నెల రోజుల పాటు రవాణా స్తంభించినా చమురు ధరలు అనూహ్యంగా పెరుగుతాయి. దీనిగుండానే కతార్‌ ఎల్‌ఎన్‌జి పైప్‌లైన్‌ కూడా నడుస్తున్నది. అందువల్ల గ్యాస్‌ ధరలు కూడా ఆకాశాన్నంటవచ్చు.
అదే గనుక జరిగితే ప్రస్తుతం 75డాలర్లకు అటూ ఇటూగా ఉన్న ముడి చమురు ధర 300డాలర్లకు పెరగవచ్చని కొందరు అంచనా వేశారు. ఇది అతిశయోక్తిగా కనిపించినా 2008 సంక్షోభనాటి 150డాలర్లయినా మనవంటి ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతాయి. ప్రపంచ యుద్ధంతో నిమిత్తం లేకుండానే అంతటి తీవ్రనష్టం, ఈతి బాధలు తలెత్తుతాయి. ఇలా జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు. అయితే అనూహ్యంగా జరిగితే మాత్రం దీనికి ఇజ్రాయిల్‌ దానికి మద్దతుదారులుగా ఉన్న అమెరికా, ఇతర పశ్చిమదేశాలే కారణం అవుతాయి. లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళ కేంద్రం మీద దాడి ద్వారా ఐరాసను కూడా వదిలేది లేదని ఇజ్రాయిల్‌ చెప్పకనే చెప్పింది. దానికి అంత కండకావరం ఎక్కిందంటే అమెరికా, ఇతర పశ్చిమదేశాలు దానికి అండగా ఉండటమే కారణం. అందుకే ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంతో పాటు అమెరికా కుట్రలను కూడా యావత్‌ సమాజం ఎలుగెత్తి ఖండించాలి.