మిషన్‌ భగీరథలో.కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

 the minimum wage should be Rs.26 thousand– యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు డిమాండ్‌
– భువనగిరి ఎస్‌ఈ కార్యాలయం ముట్టడి
– నల్లగొండ కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా
నవతెలంగాణ -భువనగిరి/ నల్లగొండ కలెక్టరేట్‌
మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, టార్చ్‌లైట్‌, హెల్మెట్‌ ఇవ్వాలని మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మికులు సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం ముట్టడి, నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేశారు. భువనగిరిలో వంగూరి రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు. కార్మికులకు రూ.9924 మాత్రమే వేతనం ఇస్తున్నారని, కానీ జిఓ నెం.60 ప్రకారం స్కిల్డ్‌ వర్కర్స్‌కి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తూ అనాజిపురం, బొమ్మలరామారంలో కార్మికులు పాము కాటుకు గురై చావు అంచుదాక వెళ్లి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాంబాబు, జిల్లా అధ్యక్షులు చిరుమల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నలగొండ జిల్లాలో ఎనిమిది రోజులు రిలే నిరాహార దీక్షలు చేసిన మిషన్‌ భగీరథ కార్మికులు పెద్దఎత్తున కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేశారు. మిషన్‌ భగీరథ కార్యాలయం నుంచి కార్మికులు కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 మంది కార్మికులు 18 ఏండ్ల నుంచి పని చేస్తున్నా కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. కాంట్రాక్టు ఏజెన్సీలు కార్మికులను మోసం చేస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ రంగంలో ఏజెన్సీలు టెండర్స్‌లో పేర్కొన్న వేతనాలు అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తున్నాయని చెప్పారు. కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు రాఘవ, జీవీపీఆర్‌లో ఆరు మాసాలుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టి కార్మికులను పస్తులు ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారాంతపు సెలవులు, గుర్తింపు కార్డులు, జాతీయ సెలవులు, పండుగ సెలవులు అమలు చేయకుండా చట్టబద్ధ హక్కులను కాలరాస్తున్నారన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ రంగంలో 2021 పీఆర్సీ ప్రకారం 30 శాతం వేతనాలు పెంచి అమలు చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం కార్మికులకు కాంట్రాక్టు ఏజెన్సీలు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయని చెప్పారు. కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు బి.నరసింహ, మిషన్‌ భగీరథ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ జంజరాల శ్రీనివాస్‌, కో చైర్మెన్లు టి.కృష్ణ, బత్తుల వెంకటేశం, కార్యదర్శులు కుడుతాల సైదులు, మహమ్మద్‌ జానీ, ఎన్‌.శ్రీనివాసులు, ఉయ్యాల మురళి పాల్గొన్నారు.