షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ కనీస వేతనాల జీవోలు సవరించాలి

షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ కనీస వేతనాల జీవోలు సవరించాలి–  ఐదురంగాల జీవోలను గెజిట్‌ చేయాలి : సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ కనీస వేతనాల జీవోలను సవరించాలనీ, ఐదు రంగాల జీవోలను గెజిట్‌ చేయాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని కార్మికశాఖ ముఖ్యకార్యదర్శికి సీఐటీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, జె.మల్లిఖార్జున్‌, రాష్ట్ర కార్యదర్శులు జె.చంద్రశేఖర్‌, బి.మధు, కోశాధికారి వంగూరు రాములు పాల్గొన్నారు. రాష్ట్రంలో 10,15 ఏండ్ల నుంచి కనీస వేతనాలను సవరించలేదనే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి ప్రతి ఐదేండ్లకోసారి సవరించడం వల్ల కార్మికుల వేతనాలు పెరుగుతాయని చెప్పారు. ఇలా చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, విద్య, వైద్య ఖర్చులు పెరిగి కార్మికులు ఇబ్బంది పడుతున్న తీరును వివరించారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలను సవరించాలనీ, దీనివల్ల ప్రభుత్వంపై పైసా భారం కూడా పడదనిను కోరారు. 10,15 ఏండ్ల నుంచి సవరించలేదు కాబట్టి ప్రస్తుత అవసరాలు, పెరిగిన ఖర్చుల దృష్ట్యా కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు చేయాలని విజ్ఞప్తి చేశారు.