– తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కామారెడ్డి మెడికల్ కాలేజీలో డాక్టర్ల సస్పెన్షన్‌ను విచారణ నివేదిక రాగానే రద్దు చేస్తామని హామీ ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్ బొంగు రమేష్ , డాక్టర్ అజ్మీరా రంగ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రఘు, డాక్టర్ అబ్బయ్య హర్షం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విన్నవించారు. అనంతరం కోఠిలోని డీఎంఈ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఎలుకలు, పిల్లుల నుంచి రోగులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హౌసింగ్ కీపింగ్ వారిదని తెలిపారు. డాక్టర్లు వైద్యం మాత్రమే అందిస్తారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సరైన మౌలిక సదుపాయాలు లేకుండా మెడికల్ కాలేజీలు ప్రారంభించిందనీ, ఇప్పటికీ కామారెడ్డి మెడికల్ కాలేజీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ తన సస్పెన్షన్ ఎత్తివేస్తామని మంత్రి హామీ ఇవ్వడం పట్ల మంత్రికి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.