నవతెలంగాణ – జమ్మికుంట
గీత కార్మికుల సమస్యల పరిష్కార బాధ్యత పొన్నం ప్రభాకర్ గౌడ్ తీసుకోవాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ముందస్తు జయంతి వేడుకలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలోని ప్రధాని కూడలి వద్ద గ్రామంలోని గీత కార్మికులు గౌడ కులస్తులు వివిధ కుల సంఘ నాయకులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికుల, గౌడ కులస్తుల సమస్యల పైన నిర్లక్ష్యం వహించకుండా పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఆయన కోరారు . జనగామ జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలని అదేవిధంగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందిన గీత కార్మికులకు నేటి వరకు కూడా ఎక్స్గ్రేషియా అందలేదని, 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు పింఛన్లు రావడం లేదని, గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యం చేయకుండా లబ్ధిదారులకు బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడుతున్న ప్రతి ఒక్క గీత కార్మికునికి కాటమయ్య రక్షణ కవచం మోకులను అందించాలని పేర్కొన్నారు .గత ప్రభుత్వంలో ఇస్తానన్న మోపేడ్ వాహనాలు నిరుపేద గీత కార్మిక కుటుంబాలకు నిరుద్యోగ యువకులకు రుణాలు అందిస్తానని మోసం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో కోరపల్లి మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ,పల్లె రవి గౌడ్, పౌడాల లక్ష్మయ్య గౌడ్, ఇల్లందుల సంపత్ గౌడ్ ,గడ్డం శ్రీనివాస్ గౌడ్, పల్లె లవ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.