– 317 జీవోకు అనుగుణమైన బదిలీలకే అనుమతి
– జీవోను సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలి : టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవోలోని నిబంధనలకు అనుగుణంగా ఉన్న భార్యాభర్తలు, ప్రాధాన్యత కేటగిరీలు, పరస్పర బదిలీలు మాత్రమే చేయాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో నెంబర్లు 243, 244, 245 జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) అసంతృప్తి వ్యక్తంచేసింది. మంత్రివర్గ ఉపసంఘం కొండను తవ్వి ఎలుకను పట్టిందని విమర్శించింది. ఈ మాత్రానికి ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించింది. 317 జీవో బాధితులందరికీ న్యాయం చేయాలనీ, ఆ జీవోను సవరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 317 జీవోలోని అసంబద్ధమైన నిబంధనల కారణంగా పలువురికి నష్టం వాటిల్లిందనీ, వాటిని సవరించి వారికి న్యాయం చేయాలంటూ గత మూడేండ్లుగా పోరాడుతున్నామని తెలిపారు. బాధితులందరికీ న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీంతో బాధిత ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసిందని తెలిపారు. ఆర్నెళ్లపాటు శోధించి సాధించింది ఏమిటంటే గత ప్రభుత్వం చేసిన పనిని ఆమోదించటం మినహా ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. దంపతుల బదిలీలు గత ప్రభుత్వంలో 19 జిల్లాల్లో పూర్తికాగా, 13 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ స్థాయి వరకు బదిలీలు నిర్వహించారని గుర్తు చేశారు. మిగిలిన వారికి బదిలీలు చేయాల్సి ఉండగా అవకాశం ఉన్నమేరకే చేయాలనీ, ఫోకల్‌కే చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారని తెలిపారు. అంటే రివర్స్ స్పౌజ్ చేయమని సూచించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్పౌజ్‌ల గురించి మాట్లాడలేదని తెలిపారు. ప్రాధాన్యతా కేటగిరీలో కారుణ్య నియామకాల ద్వారా నియామకమైన వితంతువులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని జీవోలో ఉన్న అంశాన్నే ప్రస్తావించారని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు.
పరస్పర బదిలీల్లో ఒకరు తప్పనిసరిగా 317 జీవో ద్వారా ప్రభావితమై ఉండాలనే నిబంధనను, స్థానికత మారితే సీనియార్టీ కోల్పోయే నిబంధనను యదాతథంగా ఉంచారని తెలిపారు. స్థానికత కోల్పోయిన వారి విషయం ప్రస్థావనే లేదని విమర్శించారు. వారికి తగిన న్యాయం చేయటానికి ఏం చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. గత పది నెలలుగా ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ జీవోలను చూసిన తర్వాత నిరాశ, నిస్పృహకు లోనవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం పునరాలోచన చేసి 317 జీవో బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.