పేదల అభ్యున్నతికి పాటుపడడమే ప్రభుత్వ ధ్యేయం

– కుల వృత్తులకు ఇతోధికంగా ప్రోత్సాహం
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
– నిజామాబాద్, నడిపల్లిలో ఫిష్ మార్కెట్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు
– న్యాల్కల్ మాసాని చెరువులో చేప పిల్లల విడుదల
– పాల్గొన్న ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, బిగాల, ఎమ్మెల్సీ కవిత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ- కంటేశ్వర్ 
కుల వృత్తులను ప్రోత్సహిస్తూ, పేదల అభ్యున్నతికి పాటుపడడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో రూ. రెండు కోట్లతో, డిచ్పల్లి మండలం నడిపల్లిలో రూ. యాభై లక్షలతో చేపడుతున్న చేపల మార్కెట్ల నిర్మాణాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని మాసాని చెరువులో చేప పిల్లలను విడుదల చేసి, మత్స్యకారులతో భేటీ అయ్యారు. మత్స్య కార్మిక సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మత్స్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధర్ సిన్హా, కమిషనర్ లచ్చిరాం నాయక్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతూకిరణ్ తదితరులు మంత్రితో కలిసి పాల్గొన్నారు. మత్స్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మత్స్య కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అన్నారు. నీటి వనరులు ఉన్న ప్రతి చోటా వంద శాతం సబ్సిడీపై చేపలు, రొయ్యల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల చేపల సంపద గణనీయంగా వృద్ధి చెందిందని అన్నారు. ఈ నేపథ్యంలో మంచి మార్కెటింగ్ వసతితో మత్స్యకార కుటుంబాలకు మరింత ఆర్ధిక పరిపుష్టి కల్పించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం అవకాశం ఉన్న ప్రతి చోట జిల్లా, మండల స్థాయిలలో హోల్ సెల్, రిటైల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా 75 శాతం సబ్సిడీపై ఫోర్ వీలర్ వాహనాలు, మోపెడ్ లు, లగేజీ ఆటో రిక్షాలు సమకూరుస్తోందని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెట్టింపు అయ్యిందని, మార్కెట్లోనూ చేపలకు మంచి డిమాండ్ పలుకుతుండడంతో మత్స్యకారులు అధిక ఆదాయం ఆర్జిస్తున్నారని హర్షం వెలిబుచ్చారు. ఈ దిశగా మహిళలకు కూడా ఆదాయ వనరులు సమకూరేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మత్స్య కార్మిక సంఘాల్లో సభ్యత్వం కల్పిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఇదివరకు గ్రామ పంచాయతీల ద్వారా సర్పంచ్ లు లైసెన్స్ లు జారీ చేసే విధానాన్ని తొలగించి, కేవలం మత్స్యకారులకు మాత్రమే మత్స్య శాఖ ద్వారా లైసెన్స్ లు ఇచ్చేలా ప్రభుత్వం జీ.ఓ జారీ చేసిందని వివరించారు. దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపి, చెరువులు, జలాశయాల్లో చేపల సంపదపై పూర్తిగా మత్స్యకార్మికులకే హక్కులు కల్పించామన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి హితవు పలికారు. ముఖ్యంగా చెరువులు, ప్రాజెక్టులలో విడుదల చేస్తున్న చేప పిల్లల నాణ్యతను నిశితంగా పరిశీలించాలని, నిబంధనలకు అనుగుణంగా ఫిష్ సీడ్ ఉందా లేదా అన్నది గమనించాలని సూచించారు. అప్పుడే మత్స్య సంపద గణనీయంగా వృద్ధి చెంది ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని, తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. మత్స్య కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 2016 లో మొదటగా 3900 చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం 24 వేల పైచిలుకు చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తూ రాష్ట్రంలో చేపల సంపదను రెట్టింపు చేసి మత్స్యకార కుటుంబాలలో వెలుగులు నింపుతోందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. సేద్యానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు  రైతుబంధు, రైతు భీమా, సాగునీరు అందిస్తూ రైతాంగానికి ఆదరువుగా నిలుస్తున్నారని అన్నారు. కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయుటకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్దులు, వితంతువులు, బీడీ, చేనేత కార్మికులు తదితరులకు రూ. 2,016, దివ్యంగులకు రూ. 4,016  ఆసరా పింఛన్లు అందిస్తున్నదని అన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ ద్వారా లక్షా  116 రూపాయలు  అందిస్తున్నది తెలంగాణలో మాత్రమేనని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా నిలువాలని మంత్రి కోరారు.
         ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడిన మత్స్యకార కుటుంబాలు, స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఆర్ధిక పరిపుష్టి సాధిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయని, మత్స్య కార్మికులు చేపలు పట్టుకుందామంటే చెరువులలో నీటి జాడ ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో మిషన్ కాకతీయ కింద చెరువులను మరమ్మత్తులు చేసిన ఫలితంగా ప్రతి చోటా చెరువులు జలకళతో తొణికిసలాడుతున్నాయని, 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను ప్రభుత్వం అందిస్తూ, వాటి సంపదను పూర్తిగా మత్స్య కార్మికులకే అందిస్తోందన్నారు. చేపల విక్రయాలకు అన్ని సదుపాయాలతో కూడిన మంచి వాతావరణం ఉండాలనే ఉద్దేశ్యంతో చేపల మార్కెట్లను విరివిగా నిర్మిస్తున్నారని అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్, సిరికొండ తదితర ప్రాంతాల్లోనూ ఫిష్ మార్కెట్లు మంజూరు చేయాలని కోరగా, మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు.
     కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో 1118 చెరువులలో చేప పిల్లలను విడుదల చేస్తూ, మత్స్య సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ప్రధాన జలాశయమైన శ్రీరాంసాగర్ రిజర్వాయర్ లోనూ చేపలు, రొయ్యల పెంపకం జరుగుతోందన్నారు. గత సంవత్సరం 866 చెరువుల్లో చేప పిల్లల పెంపకం జరుగగా, ఈ ఏడాది 1118 చెరువుల్లో 470 లక్షల చేప పిల్లలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మత్స్యకారులను ఆర్ధిక పురోభివృద్ధి దిశగా ప్రోత్సహించేందుకు సుమారు రూ. 21 కోట్ల రూపాయల విలువ చేసే మోపెడ్ లు, వాహనాలు, ఇతర సదుపాయాలను సమకూర్చడం జరిగిందన్నారు.  ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 20 ద్విచక్ర వాహనాలు, 75 శాతం రాయితీపై రూ. 11.55 లక్షల విలువ చేసే లగేజీ ఆటో రిక్షాను మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు. న్యాల్కల్ లోని మాసాని చెరువులో 2.74 లక్షల చేప పిల్లలు, 1.37 లక్షల రొయ్య పిల్లలు విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో మత్స్య కార్మిక ఫెడరేషన్ అధ్యక్షుడు టి.మల్లయ్య, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి, జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ మండలాలకు చెందిన జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, మత్స్యకార్మిక సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లు  తదితరులు పాల్గొన్నారు.