కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులు బయటపెడతా…

– విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ కేంద్రాల నిర్మాణంపై ఏర్పాటైన జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చినవారి తప్పుల్ని బయటపెడతానని విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన బీఆర్‌ఎస్‌ నేత రావుల చంద్రశేఖరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు తనకు విచారణ కమిషన్‌ నోటీసులిచ్చిందనీ, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరిందని తెలిపారు. తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వులపై హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే ఇచ్చిందనీ, విచారణకు వారిని కూడా పిలుస్తారా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను, అక్కడి ఈఆర్సీని కూడా విచారణ చేస్తేనే కమిషన్‌కు సమగ్ర విషయం అవగాహన కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీల్లేదన్నారు. రైతు భరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామని మాట తప్పారనీ, దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఓ నాటకం అని కొట్టిపారేశారు. పింఛన్‌ల పెంపు గురించి ప్రభుత్వం నోరు మెదపట్లేదనీ, విద్యుత్‌ బిల్లులు మాఫీ కావడం లేదని అన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయనీ, పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరిపై దాడులు జరుగుతున్నాయనీ, వీధి కుక్కలు కూడా ప్రజలపై దాడులు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. విద్యుత్‌ కమిషన్‌ లీకులు ఇస్తే, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్టే భావిస్తామన్నారు. తాము లేవనెత్తే అంశాలపై కమిషన్‌ విచారణ జరపాలనీ, లేకుంటే చైర్మెన్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని షరతు విధించారు.