– లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేత
– ఏజెన్సీలో పనిచేయడం అదృష్టంగా భావించాలి
– ఆళ్ళపల్లిలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండలంలో విధుల్లో నిర్లిప్తంగా ఉన్న పలువురు మండల అధికారులపై పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆళ్ళపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ముందుగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, 17 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలుపరచడం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఉచిత కరెంటు, 500 కే గ్యాస్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలులోకి తెచ్చిందన్నారు. ఆగస్టు నెల చివరిలోగా అర్హులైన బీద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పూరి గుడిసె బీదలకు సొంత ఇల్లు కల నెరవేర్చబోతుందని భరోసా కల్పించారు. మండలంలోని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సొంత ఇంటికలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చబోతుందని, భూమిలేని సొంత భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ భూమి కేటాయించి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల అప్పు చేసిందని అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ముందడుగు వేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే విధంగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. అనంతరం మండలంలో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ప్రారంభించి ఆళ్ళపల్లి, రాయిపాడు, అనంతోగు గ్రామాలలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖల వారీగా ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశానికి పలు శాఖల అధికారులు సరియైన నివేదిక అందించకపోవడంతో వారిపై మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేస్తుంటే అధికారులు వారి పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అని వీలైనంత త్వరగా ఆయా గ్రామాలలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులను సూచించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి వైద్యశాలలోనే సమస్యలు తెలుసుకొని, వైద్యుల పనితీరును సమీక్షించారు. వర్షాకాలం వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతుండతో అధికారులు స్థానికంగా ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో విధులు నిర్వహించడం వరం లాంటిదని ప్రతి ఒక్క అధికారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారన్నారు. ఆళ్ళపల్లి మండల కేంద్రంలోని ముస్లిం కమ్యూనిటీల ఈద్గా పట్టా స్థలంలో ఎటువంటి ఇంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్థానిక రెవెన్యూ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆళ్ళపల్లి జామా మసీదు కమిటీ పలువురు నాయకులు సంబంధిత ఈద్గా పట్టా భూమి దృవ పత్రాలతో ఎమ్మెల్యేను మా సమస్య పరిష్కారించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ఎమ్మెల్యే పర్యటనకు టేకులపల్లి సీఐ సురేష్, ఆళ్ళపల్లి ఎస్ఐ ఈ.రతీష్ ల ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో డి.శ్రీను, ఎంపీఓ బత్తిన శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యురాలు సంఘమిత్ర, విద్యుత్ శాఖ ఏఈ ఎన్.రమేష్, మండల స్పెషల్ ఆఫీసర్ టి.వెంకటేశ్వర్రావు, ఇరిగేషన్ ఎఇ దుర్గా ప్రసాద్, ఎంఈఓ పి.కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం రామనరసయ్య, మాజీ ఎంపీపీలు పెండెకట్ల పాపారావు, పడిగ సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కమిటీ కో కన్వీనర్ వాసం శ్రీకాంత్, ఆళ్ళపల్లి సీనియర్ నాయకులు మొహమ్మద్ అతహార్, తదితరులు పాల్గొన్నారు.